తిరుమల వెళితే భక్తులు శ్రీవారికి సమర్పించే నిలువుదోపిడి మాట ఎలా ఉన్నా, అంతకు మునుపే స్థానిక వ్యాపారులు భక్తులను “నిలువుదోపిడీ” చేయడం పరిపాటిగా మారింది. కానీ ప్రస్తుతం వీటికి చెక్ పడింది. హైకోర్టు దెబ్బకు తిరుమలలో వ్యాపారులు కాళ్ల బేరానికి వచ్చారు. నిన్నటివరకూ స్వామి దర్శనానికి వచ్చే భక్తులను దోచుకోవడమే పనిగా పెట్టుకుని, వందల రూపాయలు దండుకున్న హోటల్ యజమానులు, అధికారుల కఠిన వైఖరితో దిగొచ్చారు.

హోటళ్ల ముందు ధరల పట్టికలు పెట్టారు. హైకోర్టు సూచనల మేరకు, టీటీడీ సూచించిన విధంగా, ధరల పట్టికలు హోటళ్ల ముందు పెట్టారు. నిన్నటివరకూ రెండు ఇడ్లీల ధర రూ. 25 కాగా, ఇప్పుడది రూ. 7.50కు డతగ్గింది. రూ. 15 వరకూ అమ్మిన టీ ధర ఇప్పుడు రూ. 5 మాత్రమే. రూ. 100 పలికిన భోజనం ధర రూ. 31కి దిగి వచ్చింది. ఇక వెజిటబుల్ బిర్యానీ ధర రూ. 50 నుంచి రూ. 19కి, ఉప్మా ధర రూ. 20 నుంచి రూ. 9కి, ప్లేట్ మీల్స్ ధర రూ. 60 నుంచి రూ. 22.50కు తగ్గాయి. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ధరలూ సగానికి పైగా తగ్గాయి.

పట్టికలో చూపిన ధరలకన్నా ఎక్కువకు అమ్మితే, ఎవరికి ఫిర్యాదు చేయాలో సూచించే ఫోన్ నంబర్లను సైతం హోటళ్లలో ప్రదర్శిస్తున్నారు. కాగా, తాము చెల్లిస్తున్న నెలవారీ అద్దెలు భారీగా ఉంటున్నాయని, వాటిని తగ్గిస్తేనే తాము వ్యాపారాలు చేసుకోగలమని హోటల్ యజమానులు వాపోతున్న పరిస్థితి. ఈ విషయంలో చర్చించి త్వరలోనే నిర్ణయానికి వస్తామని టీటీడీ అధికారులు అంటున్నారు. కొండపై ప్రస్తుతం పెద్ద హోటళ్లు 17, చిన్న హోటళ్లు 8, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు 150, చిరు దుకాణాలు 30 వరకూ ఉన్నాయి. ఇక రెండు రోజులు హడావుడి చేసి వదిలేయకుండా, ఇదే పరిస్థితిని పక్కాగా అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు.