TTD OLd 500 1000 rupees notes నవంబర్ 8వ తేదీన 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన మోడీ సర్కార్, అందుకు తగినంత సమయం ఇచ్చి మార్చుకోమన్న విషయం తెలిసిందే. మార్చి తర్వాత ఈ నోట్లు గనుక ఉన్నట్లయితే, అది చట్టధిక్కారం క్రిందికి వస్తుందని, ఆ పైన అరెస్ట్ చేస్తామంటూ నాడు తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు. అయితే తాజాగా 8.29 కోట్ల విలువైన పాత నోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఉన్నాయి. దీంతో ఈ మొత్తాన్ని మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న వేళ ఆసక్తికర వాదనలు సాగాయి. రద్దయిన 1000, 500 నోట్ల మార్పిడికి ఎన్నారైలు, జిల్లా సహకార బ్యాంకులకు అదనపు సమయం ఇచ్చి, టీటీడీకి ఇవ్వకపోవడం అన్యాయమని పిటిషనర్ రమణమూర్తి పేర్కొన్నారు. రద్దయిన నోట్లు ఎవరి వద్దనైనా ఉంటే అది నేరమని, పాత నోట్లు ఉన్నందుకు వెంకటేశ్వర స్వామిని జైలుకు పంపుతారా? లేక టీటీడీని పంపుతారా? అని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు.

ఈ నోట్లను అనుమతించకపోవడం వల్ల స్వామి వారు భక్తులు సమర్పించిన కానుకలను అందుకోకుండా తిరస్కరించినట్టు అవుతుందని తెలిపారు. భక్తితో సమర్పించే కానుకలు స్వామివారికి, అభివృద్ధి పనులకు, భక్తుల సేవలకు వినియోగం కాకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. కాగా, తదుపరి వాదనల నిమిత్తం కేసు విచారణ వాయిదా పడింది. లాజిక్ తో కూడిన టిటిడి వాదనకు చట్టం ఎలాంటి సమాధానం చెప్తుందో చూడాలి. రద్దయిన నోట్లనీ పెద్ద ఎత్తున కానుకలుగా వచ్చాయని టిటిడి బోర్డు అప్పట్లోనే తెలిపింది.