TTD EO dharma reddy explanationతిరుమల దర్శనానికి వచ్చే భక్తుల ఇక్కట్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అంశం మీడియాలో హాట్ టాపిక్ గా మారిన తర్వాత, సర్వదర్శనానికి టోకెన్ సిస్టంను ఎత్తివేసినట్లు ప్రకటించి చేతులు దులుపుకున్న వైనం తెలియనిది కాదు. భక్తులు తమ గోడును వెలిబుచ్చుకున్న వీడియోలు సోషల్ మీడియాను కూడా చుట్టేసాయి.

ఈ తరుణంలో టీటీడీ అదనపు ఈవోగా విధులు నిర్వహిస్తున్న ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ రద్దీని ముందుగానే అంచనా వేసామని, అయితే భక్తులకు క్రమశిక్షణ లేకుండా పోయిందని, అందుకే తోపులాట జరిగిందని, ఎంత చెప్పినా నిబంధనలు పాటించడం లేదని ధర్మారెడ్డి వివరణ ఇస్తూ, తప్పంతా భక్తులదేనని చెప్పకనే చెప్పారు.

అత్యంత హాస్యాస్పదంగా మారిన ఈ వ్యాఖ్యలలో టీటీడీ తీసుకున్న చర్యలు ఏమిటో కూడా వివరిస్తే సబబుగా ఉండేది. నిజంగానే ముందుగా ఇంత రద్దీ ఊహించినట్లయితే, సర్వదర్శనానికి టోకెన్ సిస్టమ్ ను ముందుగానే ఎందుకు రద్దు చేయలేదు? అంటే భక్తులు మండుటెండలో నిలబడి, తోపులాటలతో ఇబ్బందులు పడాలన్నా ఉద్దేశమా?

అంచనాలకందని రీతిలో భక్తులు విచ్చేసారు, అందుకే వసతులు కల్పించలేకపోయామని తమ తప్పును ఒప్పుకోకుండా, భక్తులకు క్రమశిక్షణ లేదని చెప్పడం బహుశా ఇన్నేళ్ల టీటీడీ చరిత్రలో ఎవరూ చెప్పలేదు. భక్తులు పెరిగితే రద్దీ పెరుగుతుంది, తోపులాటలు జరుగుతాయి, ఇది సహజం. వాటిని నియంత్రించాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది.

అది చేయకుండా తప్పంతా భక్తులదేనని చెప్పడం, దాదాపుగా ఒక పూటంతా భక్తులు ఎండల్లో అల్లాడిపోగా, కేవలం అరగంటలోనే సమస్యను పరిష్కరించామని జబ్బలు చరచుకోవడం, బహుశా ఏపీలోని ప్రస్తుత ప్రభుత్వం నుండి అలవర్చుకున్నట్లున్నారు. ఇది కేవలం ఓ చిన్న ఘటనగా అభివర్ణించిన ధర్మారెడ్డి, దీనిని పెద్దగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆరోపణలు చేసారు.