YS- Jagan - KCR
తెలంగాణలో అసలు జరగదు అని అనుకున్నది ఒకటి జరిగింది. బహుశా రాష్ట్ర విభజన తరువాత మొదటి సారిగా తెలంగాణ గడ్డ మీద జగన్ ముద్దు… కేసీఆర్ వద్దు అనే నినాదాలు విన్పించాయి. వివరాల్లోకి వెళ్తే…. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఎంజీబీఎస్ బస్సు స్టాండ్ వద్ద నిరసన తెలియజేశారు.

ఈ క్రమంలో వారు జగన్ ముద్దు… కేసీఆర్ వద్దు అంటూ నినాదాలు ఇవ్వడం విశేషం. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చెయ్యడం కోసం జగన్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. అదే డిమాండ్ తెలంగాణ లో చేస్తుండడంతో 48,660 మంది ఉద్యోగులను ప్రభుత్వం డిస్మిస్ చేసింది.

ఆర్టీసీని 50% ప్రయివేటీకరణ దిశగా అడుగులు కూడా వేస్తుంది. కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో అధికారులు తాత్కాలిక ఉద్యోగులతో బస్సులను నడిపిస్తున్నారు. మరోవైపు సమ్మెకు మద్దతుగా తెలంగాణ బంద్‌ నిర్వహించేందుకు అఖిలపక్ష నేతలు సమాలోచనలు చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఈరోజుకు విచారణకు వచ్చింది. తక్షణమే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించేలా ఆదేశించాలంటూ ఓయూ రీసెర్చ్‌ స్కాలర్‌ సురేంద్ర సింగ్‌ ఆదివారం ఈ పిల్‌ దాఖలు చేశారు. అయితే దీనిపై తదుపరి విచారణను హైకోర్టు 15కు వాయిదా వేసింది.