TSRTC JAC calls for Million march on Nov 9ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన గడువు ముగిసిపోయింది. నిర్ణీత నవంబర్ 5 అర్ధరాత్రి వరకు కేవలం 300 చిల్లర కార్మికులు మాత్రమే విధుల్లోకి చేరారు. ఇది మొత్తం 48,600 పై చిలుకు కార్మికులలో ఒక్క శాతం కూడా కాదు. దీనితో ముఖ్యమంత్రి బెదిరింపులకు పెద్దగా భయపడలేదు అనే చెప్పుకోవాలి.

స్పందించిన వారిలో ఎక్కువ మంది రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న వారే అంటున్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ ఉద్యమంలో చేసిన మిలియన్ మార్చ్ లాగానే ఈనెల 9న మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. మిలియన్‌ మార్చ్‌కు ఉద్యోగ సంఘాల మద్దతు కోరతామని అన్నారు.

ఇప్పటికే కార్మికులు డెడ్ లైన్ లోగా విధుల్లో చేరకపోతే మిగతా 5,300 రూట్లను కూడా ప్రైవేట్ పరం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ తరుణంలో హై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. అదే విధంగా ఆర్టీసీలో 31% వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా వేచి చూసే ధోరణినే అవలంభిస్తుంది. ఇప్పటికైనా స్పందిస్తుందో లేదో చూడాలి.

మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 33 వ రోజుకు చేరింది. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మె తరువాత ఇదే అతిపెద్ద సమ్మె. రెండు పక్షాలు పట్టువిడవకపోవడంతో సామాన్యలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎవరూ కూడా సగటు ప్రయాణికుడి గురించి ఆలోచిస్తున్నట్టుగా కనిపించడం లేదు.