TSRTC employees meet Chinna Jeeyar Swamyరెండు తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య ఒక కొత్త ఒరవడి ప్రారంభం అయ్యింది. స్వతహా భక్తి ప్రవర్తులు కలిగిన కేసీఆర్, తనపై ఉన్న హిందూ వ్యతిరేకి అనే ముద్ర చెరిపేసుకోవడానికి జగన్ పీఠాధిపతుల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణాలో అయితే పీఠాధిపతులకు చవక ధరలకు భూములు ఇవ్వడం, అవి ప్రస్తుతం కోర్టులలో ఉండటం మనకు తెలిసిందే.

ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య ఇంకో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ప్రభుత్వం దగ్గర ఏమైనా పెండింగ్ డిమాండ్లు ఉంటే వాటి కోసం ఒక మాట వెయ్యమని ఆయా వ్యక్తులు ముఖ్యమంత్రుల దగ్గరకు కాకుండా పీఠాధిపతుల వద్దకు వెళ్లి తమ పనులు చేసి పెట్టమంటున్నారు. సదరు పీఠాధిపతులు కూడా అది తమ పని కాదని చెప్పడం మానేసి వారి వినతులు స్వీకరిస్తున్నారు.

ఈ విధంగా విశాఖ శారదా పీఠాధిపతి, స్వరూపానందేంద్ర స్వామి, చిన్న జీయర్ స్వామి ఈ మధ్య బిజీగా మారిపోయారు. చాలా మంది భక్తులు పీఠాలను రాజకీయాలకు నెలవుగా చేసి వీరు దళారులుగా మారుతున్నారని బాధ పడుతున్నారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను ముఖ్యమంత్రి తో మాట్లాడి నెరవేర్చేలా చిన్న జీయర్ స్వామిని కలిసి మొరపెట్టుకున్నారు.

నేడో రేపో స్వరూపానందేంద్ర స్వామిని కూడా కలుస్తారట. మరి ఈ విషయంలో ఇప్పటిదాకా తగ్గేది లేదు అని భీష్మించుకుని కూర్చున్న కేసీఆర్ ఏమైనా మనసు మార్చుకుంటారేమో చూద్దాం. మరో వైపు ఆర్టీసీ సమ్మె 26వ రోజుకు చేరుకుంది. తెలంగాణాలో సకలజనుల సమ్మె తరువాత ఇదే అతిపెద్ద సమ్మె.