TSRTC Driver Srinivas Reddy Diedరెండో సారి అధికారం చేపట్టిన తరువాత కేసీఆర్ మొట్టమొదటి సమ్మెను ఎదురుకోబోతున్నారు. ఆర్టీసి జేఏసీ ఈ నెల 19న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని రాజకీయపక్షాలు, ప్రజాసంఘాల మద్దతు ఉందని తెలిపింది. తెలంగాణ ఉద్యమం స్థాయికి ఈ బంద్ ని తీసుకుని వెళ్తామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు.

మరోవైపు సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య యత్నం చేసిన ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి కాలిన గాయాలతో మరణించారు. ఆయనను ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించి, అక్కడ నుంచి హైదరాబాద్ కు తీసుకు వచ్చినా ఫలితం దక్కలేదు. దీంతో ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత ఏర్పడింది. అదే సమయంలో ఆస్పత్రి వద్ద కూడా భద్రత పెంచారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో శ్రీకాంతాచారి బలిదానం ఎలా అయితే ఉద్యమానికి ఉత్ప్రేరకంగా ఉపయోగపడిందో ఇప్పుడు శ్రీనివాసరెడ్డి బలిదానం కూడా అలాగే పని చేసి కేసీఆర్ మెడలు వంచుతుందని కార్మిక నేతలు హెచ్చరిస్తున్నారు. చనిపోయిన శ్రీనివాసరెడ్డికి ఇద్దరు కుమారులు… ఒకరు ఆర్మీలో ఒకరు ఎయిర్ ఫోర్స్ లో పని చేస్తుండడం విశేషం.

శ్రీనివాసరెడ్డి మృతితో ప్రభుత్వం ఇరుకున పడినట్టుగా కనిపిస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చినట్టుగా అయ్యింది. మరోవైపు కేసీఆర్ ఇంత పట్టుదలగా ఉండకుండా కార్మిక సంఘాలతో చర్చలు జరిపి ఉంటే శ్రీనివాసరెడ్డి అటువంటి పనికి పూనుకునేవాడు కాదని ఇప్పటికే పలువురు విమర్శిస్తున్నారు.