TSRTC driver commits suicide in Mahababubabad48,000 పైగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 39వ రోజుకు చేరింది. ఇప్పట్లో ముగిసే అవకాశం కూడా కనిపించడం లేదు. కార్మికులతో చర్చలు జరపం అంటూ, ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వం ఈ సమస్యను మరింత జటిలం చేస్తుంది. ఈ తరుణంలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

మహబూబాబాద్‌ డిపో డ్రైవర్‌ నరేష్‌ బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే నరేష్‌ ప్రాణాలు విడిచాడు. నరేష్‌కు భార్య పోలమ్మ, ఇద్దరు పిల్లలు శ్రీకాంత్‌, సాయికిరణ్‌ ఉన్నారు. అతను 2007 నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

గత ఐదేళ్లుగా నరేష్‌ భార్య హృద్రోగంతో బాధపడుతోందని, నెలకు 5వేల మందులు వాడుతున్నారని, మరోవైపు ఇద్దరు పిల్లలు చదువుతుండటంతో నరేష్‌ ఆర్థికంగా అనేక బాధలు పడుతున్నాడని, ఈ క్రమంలో మొదలైన సమ్మె ఎంతకూ పరిష్కారం కాకపోవడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని తోటి కార్మికులు చెప్తున్నారు.

రెండు నెలల నుండి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల జీతాలు ఆపేసిన సంగతి తెలిసిందే. మృతుడు తన చావుకు ముఖ్యమంత్రి కేసీఆరే కారణం అని లేఖ రాసి చనిపోవడం విశేషం. “నా వల్ల ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలి. ఆర్టీసీలో నాదే చివరి బలిదానం కావాలని ముఖ్యమంత్రిగారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నా కుటుంబానికి వచ్చిన ఇబ్బంది మరో కుటుంబానికి రాకూడదు.” అంటూ పేర్కొన్నాడు.