TSRTC-Bus-Strike-KCR-Telangana-TRSతెలంగాణ ఆర్టీసీలో సమ్మె వివాదం తీవ్రం అవుతుంది. ఇప్పటివరకూ ఇద్దరు కార్మికులు బలవన్మరణం చెందారు. దీనితో ఉన్నఫళంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. చర్చలే లేవు అన్న ప్రభుత్వనికి వీరి చావుకు బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్టోబర్ మొదటి వారంలో సమ్మె మొదలు పెట్టినా కార్మికులను ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం వారు పని చేసిన సెప్టెంబర్ నెల జీతాలు కూడా ఆపేసింది.

సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉన్నఫళంగా 48,660 కార్మికుల ఉద్యోగాల నుండి తొలగించినట్టే అని ప్రకటించడంతో బడుగు జీవులు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికుల కోర్కెలు పూర్తిగా నెరవేర్చినా నెరవేర్చకపోయినా వారితో చర్చలు జరిపివుంటే పరిస్థితి ఇక్కడ వరకూ వచ్చేది కాదని ఇప్పటికే అందరూ అభిప్రాయపడుతున్నారు.

రెండో బలిదానంతో ఇది మరింత బలపడింది. హుజూర్ నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం మీద ఇటువంటి మాట రావడం ఎంతమాత్రం మంచిది కాదు. మరోవైపు ఈ నెల 19న కార్మిక సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ కు అన్ని రాజకీయపక్షాలు మద్దతు తెలిపాయి. ఒకవేళ ఆ బంద్ సక్సెస్ అయితే ప్రతిపక్షాలకు ఊపిరి ఊదినట్టే.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో మాదిరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలనే ప్రధాన డిమాండ్ పరిస్థితిని ఇక్కడ వరకూ తెచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే తమ ఉద్యోగాలకు భద్రత ఉంటుందని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు వస్తాయని కార్మికుల ఆశ. అయితే ఇది ఆర్ధిక భారమని ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు.