Patnam mahender reddy, Sri Pochampally Srinivas Reddy, Tera Chinnapareḍḍy TRS MLC Electionsతెలంగాణ రాజకీయాలు చిత్ర విచిత్రంగా సాగుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. నిన్న గాక మొన్న తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో ఏడు సీట్లు గెలిచి ప్రతిపక్షాలు అధికార పక్షానికి షాక్ ఇచ్చారు. తెలంగాణ లో వార్ వన్ సైడ్ కాదని ప్రజలు తమ తీర్పుతో క్లియర్ గా చెప్పారు. అయితే ఈరోజు వెల్లడైన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో మరొక రకమైన తీర్పు వచ్చింది. వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస ఘన విజయం సాధించింది.

వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై 825 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిపై తెరాస అభ్యర్థి చిన్నపరెడ్డి 226 ఓట్ల తేడాతో గెలుపొందారు. రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి.. కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిపై 244 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇటీవలే ఎంపీ ఎన్నికలలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని మల్కాజ్ గిరి, నల్లగొండ జిల్లాలోని నల్లగొండ భువనగిరి స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్… చేవేళ్లలో ఓడిపోయినా తెరాస కు చెమటలు పట్టించుకుంది.

తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ తెరాస సత్తా చాటి కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చింది. గతంలో తెరాస హవాలోనూ ఎమ్మెల్సీగా నెగ్గిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… తాను రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానం నుంచి తన సతీమణి లక్ష్మీని బరిలోకి దింపారు. అయితే అప్పట్లో రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయిన తేరా చిన్నపరెడ్డి… తాజాగా ఆయన భార్య లక్ష్మీపై విజయం సాధించారు. లోక్ సభ ఎన్నికల్లో కొంత ఎదురుదెబ్బ తరువాత వచ్చిన విజయాలు తెరాసకు ఊరట కలిగించేవే.