TRS vs Bjp problems to farmers‘ఢీ అంటే ఢీ’ అనే విధంగా కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ సర్కార్ మాటల యుద్ధం చేస్తోంది. రాష్ట్రంలో తమకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటున్న రాష్ట్ర బీజేపీ నాయకులకు చెక్ పెట్టే విధంగా బీజేపీతో యుద్దానికి సిద్ధమవుతున్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని., రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా జాప్యం వహిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేసే విధంగా ఆరోపణలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పండించిన ‘వరి’ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యాసంగిలో పండిన ప్రతి ‘వరి గింజ’ కేంద్ర ప్రభుత్వం కొనే వరకు తమ ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెరాస నేతలు అటు కేంద్ర బీజేపీ అధిష్టానానికి., ఇటు స్థానిక బీజేపీ నాయకులను ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు.

రోజు రోజుకి కేంద్రంపై కేసీఆర్ తన దూకుడును పెంచుతున్నారు. తెలంగాణ వరి పండించిన రైతుల బాధలు., ఆవేదనలు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డికి తెలియవా? కేంద్రంతో మాట్లాడి ఇక్కడి రైతులకు న్యాయం చేసే బాధ్యత మీకు లేదా?అంటూ ప్రశ్నిస్తున్నారు తెరాస నేతలు.

వడ్లు కొనాల్సిన బాధ్యతల నుండి కేంద్రం తప్పించుకోవాలని చూడటం రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధం. తెలంగాణ రైతుల కోసం అవమానాలను లెక్క చేయం. రాష్ట్రాలతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు బాధాకరం. తెలంగాణతో పెట్టుకున్న వాళ్ళు చరిత్ర పుటలలో కప్పివేయబడ్డారు అంటూ మరోసారి తెలంగాణ వాదాన్ని తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి.

తెలంగాణ బిడ్డలు నూకలు తినాలా? బీజేపీ కేంద్ర మంత్రి అహంకారపూరిత వ్యాఖ్యలు చేసారంటూ మండిపడ్డారు తెరాస నాయకులు. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. రాష్ట్ర బీజేపీ వైఖరి మరోలా ఉంది. రాష్ట్ర ప్రజలకు హామీలిచ్చి ఎన్నికలలో అధికారంలోకి వచ్చింది మీ ప్రభుత్వం. హామీలు మీరిస్తే, అమలు మాత్రం కేంద్రం చేయాలా అంటూ ఎదురుదాడికి దిగింది రాష్ట్ర బీజేపీ.

మీరేమో ఫామ్ హౌస్ లో వరి పండిస్తారు., తెలంగాణ రైతులను మాత్రం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టమంటారా? అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్నినిలిపామంటూ అంటూ గొప్పలు చెప్పే మీరు రైతులకు న్యాయం చేయలేని పరిస్థితులలో ఉన్నారు అంటూ ప్రభుత్వ వైఖరిని ఎద్దేవా చేశారు బండి సంజయ్.

రాష్ట్రంలో పాలనను పక్కనపెట్టి కేసీఆర్ కేంద్రంపై యుద్ధమనడం.,రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందించాల్సిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంతో వైరానికి రావడం., ఇలా ఒకరి మీద ఒకరు నెపం నెట్టేసుకుని, మీరు కొనాలంటే మీరు అని చివరికి పంట పండించిన రైతుని., పండించిన పంటతో సహా నడి రోడ్డు మీదకు లాగుతున్నారని తెలంగాణ రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.