TRS victory in Khammam and warangal electionsతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ప్రతి ఎన్నికల్లో ఇప్పటి వరకు జయకేతనం ఎగరేసుకుంటూ వెళ్తున్న టీఆర్‌ఎస్‌ ఖాతాలో మరో విజయం చేరింది. ఇటీవలే గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఈసారి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో తన సత్తా చాటింది. వరంగల్‌ మరియు ఖమ్మం నగర పాక సంస్థలతో పాటు, అచ్చంపేట మున్సిపాలిటీలో కూడా టీఆర్‌ఎస్‌ జోరు కొనసాగింది. ముఖ్యంగా అచ్చంపేటలో క్లీన్‌ స్వీప్‌ చేసి సంచలనాన్ని నమోదు చేసింది.

అచ్చంపేటలో 20 డివిజన్లకు గాను మొత్తంగా 57 మంది అభ్యర్థు బరిలో నిలిచారు. మొత్తం 20 డివిజన్లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుని పోటీ లేకుండా చేసుకుంది. ఇక గ్రేటర్‌ వరంగల్‌ విషయానికి వస్తే ముందునుండి ఊహించినట్లుగానే భారీ ఆధిక్యం టీఆర్‌ఎస్‌కు దక్కింది. మొత్తం 58 డివిజన్లకు గాను టీఆర్‌ఎస్‌ పార్టీ 44 డివిజన్లను సొంతం చేసుకుంది.

ఖమ్మం కార్పోరేషన్‌లో కూడా కారు జోరుగా దూసుకు పోయింది. ఖమ్మంలోని 50 డివిజన్లకుగాను టీఆర్‌ఎస్‌ పార్టీ 34 స్థానాలను గెలుపొంది మెజారిటీని దక్కించుకుంది. ఖమ్మంలో కాంగ్రెస్‌ 10 స్థానాలను గెలుచుకోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. వామపక్షాలు నాలుగు స్థానాలు గెలుచుకుని తమ ఉనికిని చాటుకున్నారు. మొత్తానికి వరుసగా వస్తున్న ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్‌ తన సత్తా చాటి తిరుగులేని రాజకీయ శక్తిగా మారుతోంది. ఈ గెలుపుతో టీఆర్‌ఎస్‌కు మరింత బలం చేకూరినట్లయ్యింది.