Can Telangana Govt Seriously Rein Private Hospitals Mafia?తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. ఇప్పటికే ముప్పై వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. టెస్టులు కొరత, ప్రభుత్వ హాస్పిటళ్ళలో అరకొర సదుపాయాలు…. ప్రైవేటు దోపిడీని అరికట్టడంలో వైఫల్యం వంటి ఎన్నో విమర్శలను అక్కడి ప్రభుత్వం ఎదురుకుంటుంది. దాదాపుగా పది రోజుల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మ్ హౌస్ కే పరిమితం అయిపోయారు.

విమర్శలు గట్టిగా వస్తున్నా తెలంగాణ మంత్రులు అంతే బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేంద్ర అంతా బానే ఉంది అనే ఒక్క డైలాగే చెబుతున్నారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే వితండవాదానికి దిగుతున్నారు.

‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ కన్పించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేంటి?, సీఎం కన్పించకపోతే పాలన ఆగిందా?, ప్రభుత్వ పథకాలు ఆగాయా?,” అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజమే కరోనా క్రైసిస్ ని సమర్ధవంతంగా ఎదురుకుంటే ముఖ్యమంత్రి కనిపించకపోయినా వచ్చే నష్టం లేదు. అది లేకే ఈ బాధ అంతా.

అలాగే… హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌తో ప్రయోజనం ఉండదని మంత్రి అభిప్రాయపడ్డారు. కరోనా వస్తుంది.. పోతుంది.. కాబట్టి ప్రజలే జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్‌ను ఆపగలరని వ్యాఖ్యానించడం గమనార్హం. దీనికి మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ నేత వి.హనుమంతురావే ఉదాహరణ అన్నారు.

ఫిజికల్ ఫిట్‌నెస్ లేనివారు మాత్రమే కరోనాతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సైన్స్ కే అందని కొత్త వాదనను మంత్రిగారు తెర మీదకు తెస్తున్నారు. అయితే ఇటువంటి వ్యాఖ్యలను ప్రజలు హర్షించరని గుర్తిస్తే ఆయనకు ప్రభుత్వానికీ కూడా మంచిది.