CM KCR TRSరెండోసారి అధికారం కైవసం చేసుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పక్కా ప్రణాళికలతో పావులు కదుపుతోంది. మరీ ముఖ్యంగా విపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ పటిష్ఠంపై తెలంగాణ రాష్ట్రసమితి దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించి, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో 29 నియోజకవర్గాల్లో విపక్ష ఎమ్మెల్యేలు ఉండగా మొదటిసారిగా హైదరాబాద్‌లోని గోషామహల్‌ నియోజకవర్గంలో ఈ ప్రక్రియను ప్రారంభించింది. బీజేపీ కి చెందిన రాజా సింగ్ గోషా మహల్ ఎమ్మెల్యే. గెలిచే అవకాశాలు మెండుగా ఉండడంతో ఈ నియోజకవర్గాన్ని తెరాస కీలకంగా భావిస్తోంది.

ఈ నియోజకవర్గంలో తెరాసకు 40 శాతానికి పైగా ప్రజాదరణ ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రాతిపదికగా అక్కడున్న సమస్యలు పరిష్కరించి, ఇంటింటికి తెరాస కార్యక్రమాన్ని ప్రారంభించాలని, మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవితలతో రెండు బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఇదే విధంగా మిగిలిన 28 నియోజకవర్గాలలోని చేపట్టాలని తెరాస నాయకత్వం భావిస్తుంది. తెరాస అధిష్ఠానం ఇప్పటికే మూణ్నెల్లకోసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తుంది. ప్రత్యేకంగా ఈ 29 నియోజకవర్గాలపై దృష్టి పెట్టి ఎలాగైనా వీటిని చేజికించుకోవాలని వ్యూహాలు పన్నుతున్నారు. పార్టీ వీక్ గా ఉన్న చోట్ల మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవితలతో బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకోవాలని వారి ప్రయత్నం.