Danger-Bells-Ringing-Loud-for-KCRటీఆర్ఎస్ సీనియర్లు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ పై గుర్రుగా ఉన్నారు. ఇటీవలే జరిగిన కేబినెట్ విస్తరణలో చోటు దక్కని వారు బాహాటంగానే తమ అక్కసును మీడియా ముందు వెళ్లగక్కారు. ఈటెల, నాయని వంటి పార్టీని ముందు నుండి అంటిపెట్టుకున్న వారు కూడా అసంతృప్తిలో ఉన్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ నిన్న పార్టీని వీడటానికి సిద్ధమై బీజేపీ ఎంపీ అరవింద్ తో కూర్చున్నారు. పార్టీ ఎలాగోలా ఆయనను పార్టీ మారకుండా చివరి నిముషంలో ఆపింది.

అయితే తెలంగాణ సీనియర్లు ఇంకా కేసీఆర్ మీద గుర్రుగానే ఉన్నారు. సహజంగా ఉద్యమంలో మొదటి నుండి ఉన్న వారు అలిగితే ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడాలి అయితే కేసీఆర్ మాత్రం ఆ పని జూనియరైన కేటీఆర్ కు అప్పగించారు. కేటీఆర్ వ్యవహారశైలి వారికి మింగుడుపడటం లేదంట. ఇటీవలి మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో నాయిని నర్సింహారెడ్డి మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. కేటీఆర్ ఆయనను ఆ విషయంపై వివరణ కోరారట.

తనేదో క్యాజువల్ గా అంటే మీడియా హైలెట్ చేసిందంటూ నాయిని వివరణ ఇచ్చుకున్నారట. ఈ నేపథ్యంలో క్యాజువల్ టాక్స్ ఏవీ చేయడానికి వీల్లేదంటూ కేటీఆర్ గట్టిగా హెచ్చరించారట. ఎంత తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేటీఆర్ పార్టీలోని సీనియర్లకు జూనియరే. ఆయన వయసు వారి రాజకీయ అనుభవం అంత ఉంటుంది. అటువంటిది ఆయన హెచ్చరికలకు దిగినా, బుజ్జగింపులకు దిగినా వారు సహించలేకపోతున్నారు. ఈ పరిణామం పార్టీలో ఎటు దారితీస్తుందో?