TRS MP Malla Reddy Responds on ED raidsతెలంగాణ మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో నిన్న ఐ‌టి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నప్పుడు ఆయనకి ఛాతిలో నొప్పి రావడంతో సూరారంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకొని మల్లారెడ్డి సూరారం బయలుదేరాలని ప్రయత్నించగా ఐ‌టి అధికారులు, సిఆర్‌పిఎఫ్ జవాన్లు ఆయనను అడ్డుకొన్నారు. దాంతో ఆయన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ, “మేము ఏమైనా దొంగతనాలు చేస్తున్నామా? దౌర్జన్యాలు చేస్తున్నామా లేక క్యాసినోలు నడిపిస్తున్నామా? కాలేజీలు పెట్టి పిల్లలని మంచి ఇంజనీర్లు, డాక్టర్లుగా తీర్చి దిద్దుతున్నాము. మాకు చాలా కాలేజీలున్నాయి కనుక కొంత డబ్బు ఇంట్లో కూడా ఉంటుంది. అదేమీ తప్పు కాదు. కానీ నా ఇంట్లో రూ 9 కోట్లు రూపాయలు పట్టుబడితే అదేదో దొంగసొమ్ము అన్నట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళు మా రికార్డులన్నీ చెక్ చేసుకొంటున్నారు కదా? దొరికిన సొమ్ముకి లెక్కలు తీసుకొంటున్నారు కదా?ఒకవేళ వాటికి లెక్కలు చూపలేకపోతే ఆ డబ్బంతా వాళ్ళనే పట్టుకుపోనీయండి. కానీ నా కొడుకు మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు?ఒకరూ ఇద్దరూ కాదు… డజన్ల కొద్దీ ఐ‌టి అధికారులు, వందల మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లతో మా ఇళ్ళమీద పడి వేదిస్తున్నారు. ఇదంతా నేను కేసీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందుకే కదా?మోడీ ప్రభుత్వం ఈవిదంగా మమ్మల్ని భయపెట్టి, బెదిరించి లొంగతీసుకోవాలనుకొంటోందేమో? కానీ అది ఎన్నటికీ సాధ్యం కాదు,” అంటూ మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్క మల్లారెడ్డి కాలేజీలే కాదు దేశంలో అన్ని ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా కాలేజీలు కూడా విద్యార్థులను, వారి తల్లితండ్రులను దోచుకొంటూనే ఉన్నాయి. సీట్లు అమ్ముకొంటూ, భారీగా ఫీజులు పిండుకొంటూ కోట్లు పోగేసుకొంటున్నాయి. కానీ ఆదాయపన్ను చెల్లించకుండా తప్పించుకోవడానికి దొంగ లెక్కలు చూపుతుంటాయి. విద్యా వ్యాపారంలో సులువుగా డబ్బు పోగేసుకొనే అవకాశం ఉంది కనుకనే రాజకీయనాయకులు ఇంజనీరింగ్, ఫార్మా, మెడికల్ కాలేజీలు స్థాపిస్తున్నారని చెప్పుకోవచ్చు.

మల్లారెడ్డి కాలేజీలు కూడా ఇందుకు అతీతం కావని ఆయన ఇంట్లో పట్టుబడిన రూ.9 కోట్లు నిరూపిస్తున్నాయి. ఓ పక్క విద్యార్థులను దోచుకొంటూ మరో పక్క ఆదాయపన్ను ఎగవేస్తూ ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నా ఐ‌టి శాఖ దాడులు చేయకూడదు… చేస్తే అది రాజకీయ కక్ష సాధింపే… అని వాదించడం మన రాజకీయ నాయకులందరికీ పరిపాటిగా మారిపోయింది. అయితే మల్లారెడ్డి ఆరోపిస్తున్నట్లు దీనిలో రాజకీయ కోణం కూడా ఖచ్చితంగా ఉందని అందరికీ తెలుసు.

ఇక ఈడీ, ఐ‌టి, సీబీఐ అధికారులు ఇంత హడావుడి చేసిన తర్వాత ఎవరినైనా దోషులుగా నిరూపించి వారి అక్రమాలకు వడ్డీతో సహా సొమ్ము కక్కించగలరా?వారికి శిక్షలు పడేలా చేయగలరా? అంటే వాటి చరిత్ర చూస్తే లేదనే అర్దమవుతుంది. కేంద్రం సైగ చేయగానే దాని ప్రత్యర్దులపై దాడులు చేసి ఈవిదంగా హడావుడి చేయడం, కేంద్రంతో వాళ్ళు బేరం సెటిల్ చేసుకోగానే కేసులను అటకెక్కించేయడం పరిపాటిగా మారింది. అందుకే ఈడీ, ఐ‌టి, సీబీఐల విశ్వసనీయత కూడా దెబ్బ తింటోంది.