Chandrababu-Naidu - KCRతెలంగాణలో తెరాస పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి 20 రోజులకు పైగా అయినా ఇంకా అక్కడి కేబినెట్ కొలువుదీరలేదు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్, మహమూద్ అలీ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. సహజంగా పదవులు ఆశిస్తున్నవారు ముఖ్యమంత్రి చుట్టూ చక్కర్లు కొట్టడం మాములే అయితే తెలంగాణలో కేసీఆర్ అప్పాయింట్మెంట్ సాధించడం అంత తేలిక కాదు కాబట్టి అది కుదరడం లేదు.

అయితే కేసీఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి అక్కడ ఎమ్మెల్యేలు కొత్త పంథా ఎంచుకున్నారు. అదేంటంటే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడును తిట్టడం. కొందరైతే ఏకంగా అమరావతి వెళ్ళి వారి వారి కులాల మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఏదో విధంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడి మీడియాలో విస్తృతంగా కనిపిస్తే తమ స్వామి భక్తి కేసీఆర్ కు చేరుతుందని, కేబినెట్ విస్తరణ సమయంలో తమను దృష్టిలో పెట్టుకుంటారని వారి తాపత్రయం.

కొందరేమో వచ్చే ప్రధాన మంత్రి కేసీఆరేనని, తెలంగాణ పథకాలు దేశానికే తలమానికమని మీడియా ముందు ఊదరగొడుతున్నారు. మరో వైపు ఆ మధ్య ఈ నెల 5 లేక 6 తారీఖులలో కేబినెట్ విస్తరణ ఉండొచ్చని సమాచారం వచ్చినా ఆ తరువాత దాని గురించి ఊసు లేదు. మరోవైపు మంత్రులు లేనందు వల్ల పాలన కుంటుపడిందని సమాచారం. వివిధ శాఖలలో ఫైళ్లు ఎన్నో పెండింగు ఉండిపోయాయని సమాచారం. మరి కేసీఆర్ ఏం చేయబోతున్నారో ఎవరికీ తెలియడం లేదు.