KCR - Telangana CMఇటీవలే జరిగిన దుబ్బాక ఉపఎన్నికలోని ఓటమిని తెలంగాణలోని అధికారపక్షం జీర్ణించుకోలేకపోతుంది. కాంగ్రెస్ కూడా కాకుండా అనామక పార్టీగా ఉన్న బీజేపీ చేతిలో ఓటమి చెందడం ఆ పార్టీకి పెద్ద షాక్. ఈ ఎఫెక్ట్ త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఉంటుందేమో అని ఆ పార్టీ నాయకులు భయపడుతున్నారు.

ఈ క్రమంలోనే నగర ప్రజలకు తాయిలాలు పంచే పనిలో పడింది తెరాస ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా మంత్రి కేటీఆర్ కాలికి బలపం కట్టుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ఓపెనింగులు చెయ్యడంలో బిజీగా ఉన్నారు. నిన్న ఉన్నఫళంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తి పన్నులో 50శాతం రాయితీ ఇస్తున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.

ఇది రూ.15 వేల వరకు ఆస్తిపన్ను కట్టిన వారికి వర్తించనుంది. దీని వల్ల హైదరాబాద్‌లో 13 లక్షల 72 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.. ఆస్తి పన్నులో రాయితీతో రాష్ట్రంపై రూ.130 కోట్ల భారం పడుతుంది. కొన్ని నెలల క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… తొందరలోనే రాజధాని ప్రాంతంలో ఆస్తి పన్నుపెంచాల్సి ఉందని చెప్పుకొచ్చారు.

ఆస్తి పన్నుపెంచడం నుండి ఆస్తి పన్నులో రాయితీ ఇవ్వడం అంటే అది తెరాసకు జీహెచ్ఎంసీ ఎన్నికల భయం పట్టుకుంది అనే మాట వాస్తవమే కదా అని రాజకీయ ప్రత్యర్ధులు అంటున్నారు. తెరాస నాయకులకు, అభిమానులకు ఒప్పుకోవడానికి కష్టంగా ఉన్నా ఆ మాటని కాదనలేని పరిస్థితి.