TRS- KCR- Mahakutami- Congress - TJS- TDPపోలింగ్ పూర్తయిన 28 గంటల తరువాత ఎన్నికల కమిషన్ తెలంగాణాలో రికార్డు స్థాయిలో 73.2% ఓటింగు జరిగిందని ఈసీ తేల్చి చెప్పింది. గ్రామీణ ప్రాంతం ప్రజలు చైతన్యంతో ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొనగా ఎప్పటిలానే పట్టణ ప్రాంత ప్రజలు ఓటింగులో నిరాశ పరిచారు. మరీ ముఖ్యంగా చదువుకున్న వారు ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు అట్టడుగున ఉన్నాయి. పోలింగ్‌ తగ్గడం ప్రధాన పార్టీలను భయపెడుతోంది. అయితే రెండు పక్షాలలోను అయోమయం ఉంది.

ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బూత్‌కు రాలేదని అనుమానిస్తున్నారు. రాష్ట్రమంతటా ప్రభుత్వ వ్యతిరేక వేవ్‌ ఉన్నా దానిని ఆ మేరకు ఓట్లు వేయించుకోలేక పోయామని ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదే క్రమంలో తెరాస నేతల్లో కూడా సంతోషం లేదు. సీమాంధ్ర ప్రజలు పట్టుదలతో ఓటేసి ఉంటారని, తాము నమ్ముకున్న బస్తీల ప్రజలే ఓటేసి ఉండరేమోనని అనుమానంతో లెక్కలు వేసుకుంటున్నారు. విభిన్నంగా వచ్చిన సర్వేల కారణంగా అభ్యర్థులు గందరగోళానికి గురై, కుదురుగా ఉండలేక పోతున్నారు.

భారీ మెజారిటీ వద్దు బయట పడితే చాలు అనే పరిస్థితికి వచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాలలో ఎంఐఎం గెలిచే 6-7 తప్ప మిగతా వాటిలో ఎవరు గెలవబోతున్నారు అనేది చాలా కీలకం. ఎన్నికల ముందు నుండీ ఈ సీట్లను బట్టే ప్రభుత్వం నిర్ణయం అవుతుందని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో ఈ తక్కువ ఓటింగు దేనికి దారి తీస్తుంది అనేది చూడాలి. మరోవైపు తక్కువ ఓటింగుకు కారణం ఏంటి అనే దాని పై కూడా విశ్లేషణలు జరుగుతున్నాయి. ఓటర్ల అనాసక్తి, వరుసగా మూడు రోజులు సెలవు రావడం కారణాలతో పాటు భారీ స్థాయిలో ఓట్ల గల్లంతు కావడం కూడా కారణంగా చెబుతున్నారు.

కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలలోనే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఓట్లు గల్లంతు కావడం గమనార్హం. కారణమేదైనా ఓటర్ తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల తరహా తీర్పు తెరాస కోరుకుంటుంటే, 2014 తరహా తీర్పు మహాకూటమి పార్టీలు కోరుకుంటున్నాయి. ఎవరిది గెలుపు ఎవరిది ఓటమి అనేది తెలియాలంటే 11 వరకు ఆగాల్సిందే. స్ట్రాంగ్ రూమ్ లలో భారీ భద్రత మధ్య ఈవీఎంలు మంగళవారం కోసం ఎదురు చూస్తున్నాయి.