kavitha accepts chandrababu naidu behind hyderababd developmentఒక అబద్దాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోదు, అలాగే ఒక సత్యాన్ని అసత్యంగా చిత్రీకరించాలని 1000 సార్లు ప్రయత్నించినా అది అవాస్తవమైపోదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు విరివిగా పనికొస్తాయి. అభివృద్ధి విషయంలో ప్రత్యర్థులకు లబ్ధి చేకూరకుండా ఉండడానికి రాజకీయ పార్టీలు వాస్తవాలను మరుగున పెట్టి, అభివృద్ధి అంతా తమ హయంలోనే జరిగిందని ప్రచారం చేసుకుంటాయి. ఇందులో మరో విశేషమేమిటంటే… కళ్ళ ముందు కనపడుతున్న ప్రత్యక్ష అంశాలలో కూడా రాజకీయ నేతలు ఇదే రకమైన వ్యవహార తీరును అవలంబిస్తారని తాజా రాజకీయ పరిణామాలు చెబుతున్నాయి.

ప్రత్యేక తెలంగాణా ఏర్పాటులో కేసీఆర్ కృషి వాటా ఎంత ప్రధానమో, హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర కూడా అంతే అన్నది బహిరంగ విషయం. ఈ అంశం ప్రజల్లో కూడా బలంగా వెళ్ళిపోయింది. ఇలాంటి అంశాలపై తప్పుడు ప్రచారం చేస్తే అవగాహనా రాహిత్యమో, స్వార్ధపూరిత రాజకీయమో అనుకోవాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సహా ఆయన తనయుడు కేటీఆర్, మంత్రులు ఇటీవల కాలంలో హైదరాబాద్ అభివృద్ధి విషయంలో చంద్రబాబు పాత్రను చాలా చులకన చేసి మాట్లాడుతున్న వైనం అందరికీ తెలిసిందే.

అయితే అలాంటి విమర్శలనే తానూ చేస్తే, గుంపులో గోవింద మాదిరి అయిపోతుందని భావించారో లేక ప్రజలను నిజాయితీతో గెలవాలని భావించారో గానీ నిజామాబాద్ ఎంపీ కవిత సత్యాన్ని ఒప్పుకున్నారు. “హైదరాబాద్ అభివృద్దిలో చంద్రబాబు పాత్ర తమకు తెలుసని, ముఖ్యంగా ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను తామూ గుర్తించామని చెప్పారు. అయితే, ఇదే సమయంలో హైదరాబాద్ మొత్తం అభివృద్ధి అనేది చంద్రబాబు వలనే జరిగిందంటే ఒప్పుకునేది లేదని” కవిత అన్నారు.

బహుశా ఈ వ్యాఖ్యలు టీఆర్ఎస్ వర్గాలకు మింగుడు పడకపోవచ్చు. కేసీఆర్ కుమార్తె అయి ఉండి కవిత ఈ వ్యాఖ్యలు చేయడం వీటికి మరింత ప్రాధాన్యత లభించేలా చేసింది. దీంతో హైదరాబాద్ అభివృద్ధి విషయంలో టీఆర్ఎస్ నేతలు వ్యక్తపరుస్తున్న బేధాభిప్రాయలకు ఇక కాలం చెల్లినట్లయ్యిందని, కవిత చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ నేతల నోళ్ళు మూయించాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.