KTR - Harish Raoఇటీవలే తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయదుందుభి మోగించి ఎదురులేని శక్తిగా ఉన్న టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చెయ్యాలని కృతనిశ్చయంతో ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థులు 16 పార్లమెంట్ స్థానాలలో 16, అలాగే మిత్రపక్షమైన ఎంఐఎం ఒకటి గెలుచుకుని మొత్తం 17 సీట్లతో కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పాలని కేసీఆర్ ఆశయంగా ఉంది. ప్రచారంలో కేటీఆర్, కేసీఆర్ అంతా తామై పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. హరీష్ ను నామమాత్రంగానే వాడుతున్నారు.

అయితే హరీష్ ను పక్కన పెడుతున్న తీరుకు ఆయన సమర్ధకులతో పాటు సిద్ధిపేట ప్రజలు కూడా గుర్రుగా ఉన్నారట. దీనితో తెరాస స్థానిక నాయకులు కొత్త పల్లవి అందుకున్నారు. ఎన్నికల ప్రచారంలో కొందరు నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన హరీశ్‌రావుకు మంత్రివర్గంలో చోటు దక్కని కారణంగా కార్యకర్తలు నిరాశతో ఉన్నారని, అయితే త్వరలోనే మన నాయకుడికి మంచి పదవి వస్తుందని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో శుభవార్త వింటామని వారు చెప్పారు.

మెదక్ పార్లమెంట్ స్థానం గెలవడానికి ఎప్పుడూ సిద్దిపేటలో హరీష్ తెచ్చే మెజారిటీనే కీలకంగా ఉంటుంది. దీనితో ఈ సమయంలో ఆయన అభిమానులను బాధ పెట్టడం మంచిది కాదని తెరాస భావిస్తోందట. హరీష్ తో పాటు కేటీఆర్ కు కూడా పదవి ఇవ్వలేదు కేసీఆర్. అయితే ఆయనను తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. కేటీఆర్ కు పదవి లేనప్పటికీ ఆయనే సీఎం అన్నట్టుగా పాలన సాగుతుంది. ఒకవేళ కేసీఆర్ కలనెరవేరి ఢిల్లీ వెళ్లే అవకాశం వస్తే కేటీఆర్ ను ముఖ్యమంత్రి చెయ్యడం ఖాయంగా కనిపిస్తుంది.