TRS-Govt-KCR-Andhra-Pradesh-Politicsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తరువాత సిఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ వ్యవహారాలలో చంద్రబాబునాయుడు జోక్యం చేసుకొన్నందున మేము కూడా తప్పకుండా ఏపీ రాజకీయాలలో జోక్యం చేసుకొంటాము. చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము,” అని చెప్పారు. అనంతరం కేటీఆర్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్ళి భేటీ అయ్యారు. ఆ తరువాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ను భీమవరం పంపించి బీసీలను, యాదవులను కూడగట్టే ప్రయత్నం చేశారు కూడా. ఆ సందర్భంగా ఎన్నికలలో చంద్రబాబునాయుడును ఓడగొట్టడమే తమ లక్ష్యం అని తలసాని బహిరంగరంగానే ప్రకటించారు.

కానీ ఆ తరువాత హటాత్తుగా తెరాస వెనక్కు తగ్గింది. ఆంధ్రా రాజకీయాలు, ఎన్నికల గురించి తెరాస నేతలు మాట్లాడటం మానేశారు. తెరాస వైఖరిలో వచ్చిన ఈ మార్పును దృవీకరిస్తున్నట్లు “ఆంధ్ర రాజకీయాల పట్ల మాకేమాత్రం ఆసక్తి లేదు. కనుక ఆంధ్రా రాజకీయాలలో మేము వేలు పెట్టాలనుకోవడం లేదు,” అని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. తెరాస ఎంపీ కవిత కూడా ఇంచుమించు అదేవిధంగా మాట్లాడారు.

అకస్మాత్తుగా తెరాస వైఖరిలో ఇంత మార్పుకు కారణం ఏమిటి? అనే ప్రశ్నకు ఏపీ సిఎం చంద్రబాబునాయుడు మాటలలో సమాధానం లభిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబునాయుడు జోక్యం చేసుకొన్నప్పుడు, సిఎం కేసీఆర్‌తో సహా తెరాస నేతలు ఏవిధంగా చంద్రబాబును బూచిగా చూపించి విజయం సాధించారో, ఇప్పుడు చంద్రబాబుతో సహా టిడిపి నేతలు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తదితరులు కూడా కేసీఆర్‌ని బూచిగా చూపించి వైసీపీని ఓడగొట్టి విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు తెరాసను, కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శిస్తుండటానికి ఇదే కారణమని చెప్పవచ్చు.

అంటే ఏపీ ఎన్నికలలో సిఎం కేసీఆర్‌ లేదా తెరాస నేతలు నేరుగా జోక్యం చేసుకొంటే వైసీపీ గెలువకపోగా టిడిపి చేతిలో ఘోరంగా ఓడిపోయే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. బహుశః అందుకే తెరాస హటాత్తుగా తన వైఖరిని మార్చుకొని వైసీపీకి తెర వెనుక మద్దతు ఇస్తోందని భావించవచ్చు.

కానీ కేసీఆర్‌ ఆఫర్ చేసిన ‘రిటర్న్ గిఫ్ట్’ను చంద్రబాబునాయుడు ఇప్పటికే బాగా వాడేసుకొంతున్నారు. “కేసీఆర్‌ ఇస్తానన్న ‘రిటర్న్ గిఫ్ట్’ చంద్రబాబునాయుడుకు నిజంగానే ‘గిఫ్ట్’ గా మారిందని” పవన్‌ కల్యాణ్‌ అనడం చూస్తే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

కేసీఆర్‌ బాబుకు ఇస్తానన్న ఆ ‘రిటర్న్ గిఫ్ట్’ ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డికి గుదిబండగా మారిందని చెప్పక తప్పదు. ఎందుకంటే, అప్పటి నుంచి వరుస్గా జరిగిన ఈ పరిణామాలన్నీ తెరాస-వైసీపీల మద్య బంధాన్ని గట్టిగా నొక్కి చెప్పిననట్లయింది. ఏపీని, ఏపీ నాయకులను, ప్రజలను కించపరుస్తూ మాట్లాడే కేసీఆర్‌తో దోస్తీ చేసిన జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? అనే చంద్రబాబునాయుడు ప్రశ్నకు జగన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ నేతల వద్ద సమాధానం లేదు.