TRS Party entry in Andhra Pradesh politics Alliances with whom ఏపీలో ఉపాధ్యాయులను జగన్ ప్రభుత్వం వేదిస్తోందంటూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అదే అనుమానం వ్యక్తం చేశారు. ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, “మంత్రి హరీష్‌ రావుకి తెలంగాణ సిఎం కేసీఆర్‌కి మద్య ఏవైనా విభేధాలున్నాయా లేదా ఏమైనా రాజకీయ ఆలోచనలతో ఆవిదంగా మాట్లాడారో తెలీదు. కానీ మా రాష్ట్రంలో టిడిపి, దాని అనుకూల మీడియా మా ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేస్తోందో మంత్రి హరీష్‌ రావు నోట కూడా అటువంటివే వినిపించాయి. మేము మీ రాష్ట్రం, మీ ప్రభుత్వం గురించి మాట్లాడనప్పుడు మీరు పదేపదే మా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి? మాచేత తిట్టించుకొని ఉపఎన్నికలలో సానుభూతి ఓట్లు పొందాలనుకొంటున్నారా? అయినా మీకు, సిఎం కేసీఆర్‌కు ఏమైనా గొడవలు ఉంటే అవి మీలో మీరు చూసుకోవాలి కానీ మామీద పడతామంటే ఎలా?” అంటూ చాలా ఘాటుగా బదులిచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో జాతీయపార్టీ స్థాపించి జాతీయ రాజకీయాలలో ప్రవేశించబోతున్నారు. ఇంతకాలంగా ఆయన పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి దూరంగా ఉంటున్నప్పటికీ ఇప్పుడు ఏపీకి కూడా తన పార్టీని విస్తరించాల్సి ఉంటుంది. అందుకోసం ఏపీలో ఏదో ఓ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలి లేదా ఒంటరిగా అయినా పోటీ చేయవలసి ఉంటుంది. కనుక అటువంటి ఆలోచనతోనే మంత్రి హరీష్‌ రావు చేత కేసీఆర్‌ ఈవిదంగా మాట్లాడించారా? అని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సందేహం వ్యక్తం చేసినట్లున్నారు.

ఏపీలో కేసీఆర్‌ పార్టీ ప్రవేశించడం ఖాయం. గత ఎన్నికలలో వైసీపీని గెలిపించేందుకు ఆయన తోడ్పడినప్పటికీ, ఆ తర్వాత వారి మద్య దూరం పెరిగింది. అయితే ఒకరినొకరు ద్వేషించుకొనే స్థాయిలో మాత్రం లేదనే చెప్పవచ్చు. కానీ ఏపీలో 175 సీట్లు వైసీపీయే గెలుచుకోవాలని జగన్ అనుకొంటున్నప్పుడు, కేసీఆర్‌ పార్టీకి రెడ్ కార్పెట్ పలికి స్వాగతం పలకరు.

ఇక టిడిపి, చంద్రబాబు నాయుడుతో కేసీఆర్‌కు ఎన్నడూ సఖ్యత లేదు. జనసేన పార్టీ ప్రస్తుతం బిజెపితో ఉంది. భవిష్యత్‌లో టిడిపితో చేతులు కలపవచ్చు. కనుక జనసేన కూడా కేసీఆర్‌ జాబితాలో ఉండదు. ఇక మిగిలిందల్లా వామపక్షాలే. తెలంగాణలో ఎలాగూ వామపక్షాలతో పొత్తులు పెట్టుకొన్నారు కనుక ఏపీలో కూడా వాటితోనే పొత్తులు పెట్టుకొని తెలంగాణ సరిహద్దులోని ఏపీ జిల్లాలో కేసీఆర్‌ పార్టీ పోటీ చేయవచ్చు.