TRS doing same mistake of chandrababu naidu did  in telanganaనిజమో కాదో దేవుడికి తెలియాలి గానీ ఒకానొక దశలో తెలంగాణలో మహాకూటమికి మంచి అవకాశం ఉందని, చివరి నిముషం వరకు పొత్తులు, సీట్ల కేటాయింపుపై స్పష్టత లేకపోవడం, చంద్రబాబు మితిమీరిన ప్రచారం వల్ల తెరాసకు అనుకూలంగా మారిందని విశ్లేషకుల అభిప్రాయం. మహాకూటమి వస్తే ఆంధ్ర పెత్తనం తిరిగి వస్తుందని, అమరావతి నుండి పాలన సాగుతుందని తెరాస చేసిన ప్రచారం బాగా పని చేసింది. సెంటిమెంట్ రగిలి తెరాసకు మేలు చేసింది. అయితే చంద్రబాబు చేసిన తప్పే తెరాస కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

ఆంధ్ర వారికి తెలంగాణలో పనేంటి అని చెప్పి ఇప్పుడు తెరాస కూడా ఆంధ్ర రాజకీయాలలో వేలు పెట్టడానికి ట్రై చేస్తుంది. అంతటితో ఆగకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారు ఆంధ్ర వెళ్ళి అక్కడి ప్రభుత్వం మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చెయ్యడం, కేసీఆర్ ను ఇంప్రెస్స్ చెయ్యడానికి రోజుకు రెండు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబుని తిట్టడం అతిగా కనిపిస్తుంది. ఎలాగైతే తెలంగాణ ప్రజలు తమ రాష్ట్ర రాజకీయాలలో ఆంధ్ర పెత్తనాన్ని ఎలా తిరస్కరించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అలాగే భావించే అవకాశం ఉంది.

చంద్రబాబు తెలంగాణాలో చేసిన తప్పే… తెరాస ఏపీలో చేస్తుంది. దీని వల్ల వాళ్ళు అనుకున్నది జరగకపోగా చంద్రబాబుకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్ర సెంటిమెంట్ రేకెత్తించే పనిలో పడ్డారు టీడీపీ వారు. జగన్ తో బహిరంగంగా చేతులు కలపడం కూడా తప్పే. తెర వెనుక ఉండి చెయ్యాల్సిన సాయం చేస్తే పని జరిగిపోతుంది. ఇప్పుడు ఓపెన్ అయిపోయి చంద్రబాబుకు అడ్వాంటేజ్ అయ్యేలా చేస్తున్నారు. ఏకంగా తెరాస నేతలు ఆంధ్ర వెళ్లి వైకాపాకు ప్రచారం చేస్తారు అంటున్నారు.

ఇదే జరిగితే ఇది వైకాపా వేసుకున్న అతిపెద్ద సెల్ఫ్ గోల్ అని చెప్పవచ్చు. జగన్, పవన్ కళ్యాణ్, మోడీ, కేసీఆర్ ఇలా అందరూ ఒక్కటయ్యి ఒక్కడి మీద పడుతున్నారు. గతంలో ఇదే రకమైన రాజకీయం (మహాకూటమి) తప్పని తెలంగాణ లో తెరాస వారు వాదించారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో భిన్నంగా ఏమీ జరగడం లేదు. కాకపోతే కొన్ని పబ్లిక్ గా పెట్టుకుంటున్న సంబంధాలు, కొన్ని చీకట్లో చేస్తున్న వ్యవహారాలు అంతే తేడా. ఆంధ్ర ప్రజలు వీటికి ఎలా స్పందిస్తారో చూడాలి.