TRS Criticizes lagadapati rajagopal survey on telangana elections 2018-కచ్చితమైన సర్వేలకు పెట్టింది పేరు లగడపాటి రాజగోపాల్. అందుకే ఆయనను ఆంధ్ర ఆక్టోపస్ అంటారు. సహజంగా ఎన్నికల తరువాత తన సర్వే ఫలితాలు ప్రకటించే లగడపాటి ఈ సారి ముందే గాలి ఎటు ఉంది అనే విషయం చెప్పేశారు. కొంత ఆయన చెబితే ఆయనను రెచ్చగొట్టి ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ మొత్తం చెప్పించేశారు. ఒక్క సీట్ల అంచనా తప్ప మహాకూటమికే ఈ ఎన్నికలు అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దీనితో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.

ఓడిపోవడం గారంటీ అని తెలిసి చంద్రబాబే లగడపాటితో దొంగ సర్వే చెప్పించారని తెరాస వారి ఆరోపణ. అదే ప్రకారంగా లగడపాటి మీడియా ముందుకు వచ్చిన చేసిన రచ్చ వల్ల కోర్ తెలంగాణ ఓటర్లు నొచ్చుకున్నారని, దీనిని ఉపేక్షిస్తే మళ్ళీ ఆంధ్ర వారి పెత్తనం ఎక్కువ అవుతుందని గ్రహించారని దీనితో లగడపాటి ప్రెస్ మీట్ల వల్ల పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ వైపు పోలరైజ్ అయ్యారని తెరాస వారు చెబుతున్నారు. ఓడిపోతున్నాం అని చెప్పడం వల్ల మా శ్రేణులు మరింత కసిగా పని చేస్తున్నారని అంటున్నారు.

లగడపాటి మాకు మేలే చేశాడు అని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు మహాకూటమి నాయకులు మాత్రం ఎప్పుడూ గెలిచే పార్టీ వైపు ఉండాలి అని కోరుకునే ఓటర్లు గణనీయంగా ఉంటారని వారు లగడపాటి చెప్పినదాని బట్టి మాకే ఓటు వేస్తారని దీనితో తమదే విజయం అని చెప్పుకొచ్చారు. దీనితో ఓటరు నాడి ఎలా ఉండబోతుందో తెలియాలంటే డిసెంబర్ 11 వరకు ఆగాల్సిందే. అయితే రేపు సాయంత్రం వచ్చే ఎగ్జిట్ పోల్ ఫలితాల బట్టి ఒక అంచనాకు రావొచ్చు.

మరోవైపు ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థుల బలాబలాలపై ఆయా పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. పోటాపోటీగా ప్రచారం చేసిన ఆయా పార్టీలు బలమైన ప్రత్యర్థులపై దృష్టిసారిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌- కూటమి మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. బీజేపీ కొన్ని చోట్ల గెలుపు, ఓటములను శాసించే విధంగా ఉంది. ఇబ్రహీంపట్నం, వికారాబాద్‌ తో పాటు మరికొన్ని చోట్ల రెబెల్స్‌ ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. మరోపక్క డబ్బు పంపకం భారీ స్థాయిలో జరుగుతుంది.