KCR_National_Party_Andhra_Pradesh_Electionsబిఆర్యస్ ఆంధ్రలో అధికార ప్రతిపక్షాలతో జట్టు కడితే ఎటువంటి లాభ నష్టాలుంటాయనేది మెుదటి రెండు భాగాల్లో చెప్పుకున్నాం. ఇక మూడొవ అవకాశం బిఆర్యస్ ఆంధ్రలో పోటీ చేస్తే ఎలా ఉంటుందనేదానిపై విశ్లేషకుల అభిప్రాయం ఇలా ఉంది.

ఒకవేళ బిఆర్యస్ తను సొంతగా పోటీ చేస్తే ముందుగా నాయకులు చేరికలు. ఆంధ్రకు సంబందించి ఎటువంటి సైద్దాంతిక భూమిక లేని బిఆర్యస్ ఎన్నికలలోపు సొంతగా నాయకులను తయారుచేసుకోవడం అసాధ్యం, అది ఇతర పార్టీల అసంతృప్తుల నుంచి కానీ, ఇప్పుడు రాజకీయంగా క్రియాశీలంగా లేని వారి నుంచి గానీ నాయకులను తీసుకోవాలి. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి ఎక్కువ చేరికలు జరిగే అవకాశం ఉంది. వైసిపి అధికారంలోకి వచ్చాక వివిధ కారణాలతో ప్రతిపక్షాల నుంచి అనేక మంది నాయకులు వచ్చి చేరారు. ఇప్పుడు అధికార పార్టీకి అదిక శాతం నియెూజకవర్గాలలో ఇద్దరు ముగ్గురు నాయకులు పోటీపడుతున్నారు. వారిలో టికెట్ రాదనుకున్నారు కేసిఆర్ ఇచ్చే ఆఫర్ బట్టి ఆ పార్టీ నుంచి తమ అదృష్టం పరీక్షించుకోవచ్చు. ఈ మద్య పికే సర్వే బట్టి కనీసం 60 -75 మంది సిట్టింగ్లకు టికెట్ నిరాకరించే అవకాశం ఉంది అన్న వార్తలు వచ్చాయి, వారిలో అధికులు కేసిఆర్ పంచన చేరవచ్చు. అలాగే ఈసారి వారసులకు టికెట్లు లేవన్నట్టు వార్తలు కూడా వచ్చాయి, అటువంటి వారిలో కొందరు తమ వారసులను ఇక్కడకు పంపి తాము లోపకాయిరీగా మద్దతు పలకవచ్చు.

ఇదికాక 2019లో తెలంగాణలో టిడిపి నాయకుల వ్యవహారాలను నొక్కి పెట్టిన విధంగా, ఈసారి వైసిపి నాయకుల ఆర్ధిక వ్యవహారాలను ఎన్నికల సమయంలో నొక్కిపెట్టే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కేసిఆర్ అభిమానులు, ఆయన సామాజిక వర్గంలో కొంత మంది వైసిపి వెంట నిలబడ్డారు. ఆ ఓట్ ఇప్పుడు బిఆర్యస్ కు చీలితే కనీసం గతంలో వచ్చిన దానిలో కనీసం 1 శాతం ఓట్లు వైసిపికి తగ్గే అవకాశం ఉంది. గతంలో బాబుపై కోపంతో వైసిపికి ఓట్ చేసిన బిజేపి మద్దతుదారులలో మెజారిటీ ఈ పొత్తు వల్ల బిజేపికి ఓట్ చెయ్యవచ్చు, ఆమేరకు మరొక 2 శాతం ఓట్లు వైసిపి నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ అధికారం ద్వారా సంపాదించిన దానిని అధికారపార్టీ నాయకులు హైదరాబాద్ రియల్ ఎస్టేట్, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు, వాళ్లందరి జుట్టు అక్కడి బిఆర్యస్ ప్రభుత్వానికి చిక్కినట్టే. అలాగే గత ఎన్నికల్లో టిడిపికి వ్యతిరేకంగా తలసాని వంటి నాయకులను ప్రయెూగించినట్టు, ఈసారి మరిన్ని వర్గాల నాయకులను ప్రయెూగించి అధికార పార్టీపై వ్యతిరేకతను పెంచే అవకాశం ఉంది.

ఇక తెలుగుదేశం నుంచి కూడా కొంత వరకు వలసలు ఉండే అవకాశం ఉన్నా అవి అధికార పార్టీ స్థాయిలో ఉండకపోవచ్చని అంచనా. ప్రభుత్వం ఈ స్ధాయిలో అణిచివేత చేస్తున్నా ఇంకా పార్టీలోనే ఉన్న నాయకులు అందరు పార్టీకి వీరవిధేయులని వారు అవకాశ వాదంతోనే, మరో కోణంలోనో పార్టీ మారే అవకాశాలు తక్కువని అభిప్రాయపడ్డారు. ఆస్తులు, వ్యాపారాల రక్షణ కోసం, కేసుల భయంతోనో పార్టీ మారేవారు ఇప్పటికే ఇక్కడి అధికార పార్టీలోనో, లేకపోతే కేంద్రంలోనే అధికార పార్టీలోనో చేరిన కొన్ని ఉదాహరణలున్నాయి. ఇక హైదరాబాద్‌లో ఆస్ధులున్న నాయకులు గత ఎన్నికల అనుభవంతో ఇప్పటికే తమ వ్యాపారాలు, వ్యవహారాలు కొంత మార్చుకుని తర్వాత ఎన్నికల్లో ఆ ఇబ్బందులు అదిగమించే ఏర్పాట్లు చేసుకున్నట్టు వినికిడి. అలాగే ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, ప్రదాన ప్రతిపక్షంపై ప్రజల్లో సానుకూలత ఉన్న ఈ సమయంలో ప్రయెూగాలు చేసి మరోసారి అధికారానికి దూరంగా ఉండాలని టిడిపి నాయకులు అనుకోకపోవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ప్రభుత్వానికి అనుకూలత రావచ్చు కదా అనే ప్రశ్నకు ఓ ప్రముఖ సెఫాలజిస్టు ఇలా అభిప్రాయ పడ్డారు, ఈ స్ధాయి ప్రజా వ్యతిరేకత ఉన్న సమయంలో సాదారణంగా బలమైన ప్రతిపక్ష పార్టీకి ప్రజల మద్దతు ఉంటుంది, ఓ మాదిరి, చిన్న ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు కూడా కొంత వరకు బలమైన ప్రతిపక్షానికే ఓటు చేస్తారు. ఇక ఈ రాష్ట్రంలో ఎలాంటి ప్రజా మద్దతు లేని పార్టీ రావడం వల్ల అతికొద్ది స్థానాల్లో పదుల్లో లేదా వందల్లో కొన్ని ఓట్లు సంపాదించే అవకాశం తప్ప ఓట్లు చీల్చే అవకాశం ఏమాత్రం లేదని, అందులోనూ అధికార పక్షానికి అతి సన్నిహితంగా ఉండే మరో పార్టీకి ఆ మాత్రం కూడా ఉండదని పేర్కొన్నారు.

దీని ఆధారంగా బిఆర్యస్ సొంతగా పోటీ చెయ్యడం వల్ల గత ఎన్నికల్లో వైసిపి పొందిన ఓట్లలో కనీసం 3-5%. వరకు కోతపడే అవకాశం ఉంది, అంటే దాదాపు 15 స్థానాల వరకు ప్రభావితం కావచ్చు. ఆ ఓట్ బిఆర్యస్ కు నేరుగా బదిలీ కాకపోయినా ప్రతిపక్ష పార్టీలకు మళ్లి ఆ మేరకు ప్రతిపక్షం లబ్ధి పొందే అవకాశం ఉంది. అదే సమయంలో అన్ని ప్రతిపక్షాల ఓటు కలిపి కేవలం 0.5% కంటే తక్కువ మాత్రం చీలి ఆ ప్రభావం వాటిపై ఏమాత్రం ఉండదని అంచనా వేస్తున్నారు.

శ్రీకాంత్.సి