TRS BRS Andha Pradesh Politicsమూడేళ్ళుగా కేంద్రంలోని అధికార బిజేపిపై హుంకరిస్తూ, ఇదిగో అదిగో అని ఊరిస్తూ వచ్చిన కేసిఆర్ తనను తాను జాతీయ రాజకీయ యవనిక మీద నిలబెట్టకునేందుకు సొంత వేదిక భారత్ రాష్ట్ర సమితి(బిఆర్యస్) ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ వేదిక గురించి ప్రత్యర్ధి పార్టీలు తమ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో కూడా ఇప్పుడు ఇదొక చర్చనీయాంశం అయ్యింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రలో ఆ పార్టీ అసలు పోటీ చేస్తుందా? లేకపోతే ఇక్కడ ఏదో ఒక పార్టీకి మద్దతిస్తుందా? ఆ పార్టీ పోటీ చేస్తే ఎవరికి ఎక్కువ నష్టం అనే విధంగా చర్చలు చేస్తున్నారు.

ఈ విషయం మీద విశ్లేషణ చేస్తే ముందుగా ఆ పార్టీ గత ఎనిమిది సంవత్సరాలలో తెర వెనుక, ముందు అత్యంత సన్నిహితంగా మెదలిన అధికార వైసిపితో జట్టు కడితే ఎలా ఉండచ్చో చూద్దాం. 2014 ఎన్నికల సమయంలోనే కేసిఆర్ వైసిపికి తన అనుకూలతను ప్రకటించారు. పత్రికా ముఖంగానే తెలంగాణలో తన పార్టీ, ఆంధ్రలో వైసిపి అధికారంలోనికి రాబోతున్నాయని తన దగ్గర సమాచారం ఉందని తెలిపారు. కానీ ఆంధ్రలో ఆయన అంచనాలు తప్పి ఇక్కడ తెలుగుదేశం అధికారంలోనికి వచ్చింది. అప్పటి నుంచి టిఆర్యస్, తెలుగుదేశం ఉప్పు, నిప్పు వలెనే రాజకీయాలు చేసాయి. తెలంగాణ యంయల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటుతో అవి పరాకాష్టకు చేరాయి. 2018 తెలంగాణ ఎన్నికల్లో టిడిపి పొత్తుకు ప్రయత్నించినా టిఆర్యస్ అంగీకరించలేదని కేటిఆర్ ఓ సందర్భంలో చెప్పారు. ఇక ఆ ఎన్నికల్లో టిడిపి, కాంగ్రేసుతో పొత్తు పెట్టుకోవడం కేసిఆర్ కు అగ్గిపెట్టినా, అదే అనుకూలంశంగా మార్చుకుని తెలంగాణ సెంటిమెంట్ తిరిగి రాజేసి ఆ ఎన్నికల్లో విజయం సాదించారు. అప్పటి వరకు లోపకాయిరీగా వైసిపికి మద్దతిచ్చిన కేసిఆర్, అక్కడి నుంచి పుర్తిగా తెర ముందే తన శక్తి యుక్తులను జగన్ రెడ్డికి మద్దతుగా మెూహరించారు. 2019 ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో తలసాని వంటి తన కేబినేట్ మంత్రులు కూడా బిసి సభలు నిర్వహించడానికి ఇక్కడికి వచ్చారు. ఇక డేటా చౌర్యం కేసు తీసుకుని నేరుగా ప్రభుత్వం తరుపునే వైసిపికి మద్దతిచ్చారు. ఆంధ్రలో కేసిఆర్ సామాజిక వర్గంలో కొంత చీలిక వచ్చి వైసిపికి పనిచేసారు. అలాగే గత ఎన్నికల్లో బిజేపి అభిమానుల్లో 70% పైగాటిడిపి ఓటమి కోసం వైసిపికి మద్దతిచ్చారు, ఆ ఓట్లు ఇప్పుడు వైసిపి నష్టపోవచ్చు.

గత ఎన్నికల్లో వైసిపికి వంద శాతం సహాయ, సహకారాలు అందించిన టిఆర్యస్ ఇప్పుడు బిఆర్యస్ రూపంలో వైసిపితో జట్టు కడితే దానివల్ల కొత్తగా వైసిపికి కలిగే రాజకీయ ప్రయెూజనం దాదాపు శూన్యమే అని చెప్పుకోవచ్చు. కేసిఆర్ అభిమానులు, వర్గీయులు గత ఎన్నికల్లోనే పూర్తిగా వైసిపికి అనుకూల ఓట్ చెయ్యడం వల్ల ఇప్పుడ ఓట్ల పరంగా కూడా కొత్తగా వచ్చే లాభం లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దీనిని బట్టి బిఆర్యస్, వైసిపి పోత్తు వల్ల వైసిపికి లాభం, టిడిపికి నష్టం దాదాపు శూన్యం అని తెలుస్తుంది.

శ్రీకాంత్.సి