trs and ysrcp leaders AP power cut roads issueతెలంగాణ నేతలకు, ముఖ్యంగా అధికార టిఆర్ఎస్‌ నేతలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రభుత్వం అంటే ఎటువంటి గొప్ప అభిప్రాయం ఉందో నిన్న మంత్రి కేటీఆర్‌ మాటల్లోనే మరోసారి విన్నాము. దీనిపై ఏపీ మంత్రులు ఘాటుగా స్పందిస్తుండటంతో, ‘మన అభిప్రాయం ఎలాగూ మారదు ఇప్పుడు వీళ్లతో ఎందుకొచ్చిన గొడవ అనుకొన్నారో ఏమో, మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో “ఓ సమావేశంలో నేను చేసిన వ్యాఖ్యలపై ఏపీలో నా మిత్రులు బాధపడుతున్నట్లు తెలిసింది. సిఎం జగన్మోహన్ రెడ్డిగారు నా సోదరుడి వంటివారు. ఆయన నాయకత్వంలో ఏపీ అభివృద్ధిపధంలో సాగిపోతుందని ఆశిస్తున్నాను,” అని ట్వీట్ చేశారు.

అయితే తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొంటున్నానని కానీ, ఆ విదంగా మాట్లాడి ఏపీ ప్రభుత్వాన్ని నొప్పించనందుకు క్షమించమని గానీ అడగలేదు. “ఏపీలో కరెంట్ లేదు, నీళ్ళు లేవు, సరైన రోడ్లు కూడా లేవంటూ నిన్ననే ఏపీ ప్రభుత్వ పనితీరుపై కేటీఆర్‌ తన అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పారు. కనుక అటువంటి అసమర్ధ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి సాధించాలని కోరుకొంటున్నాననడం వెటకారమే కదా?

తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏపీ మంత్రులకు చురకలు వేశారు. “ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణతో సహా ఏపీ మంత్రుల కుటుంబాలు ఇక్కడ హైదరాబాద్‌లోనే ఉంటున్న మాట వాస్తవం కాదా? విజయవాడకు చెందిన చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వ్యాపారాలు చేసుకొంటున్నారు.

అయినా కేటీఆర్‌ ఏమన్నారు. అక్కడ ఏపీలో కరెంట్ లేదు…రోడ్లు పాడైయ్యాయని ఉన్న మాటే కదా చెప్పారు. ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా మా రాష్ట్రంలో కరెంట్ కొరత ఉందని చెప్పుకొన్నారు కదా?అదే మాట మా కేటీఆర్‌ గారు అంటే ఉలుకెందుకు?

మేము కరెంట్ సమస్య తీర్చుకొని రోడ్లు వేసుకొంటున్నాము. మీరూ వేసుకోండి. మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొంటామంటే మేమేమైన వద్దన్నామా…అడ్డుపడ్డామా? ఆల్ ది బెస్ట్ అని చెపుతాము,” అని మంత్రి వేముల అన్నారు.

తెలంగాణ నేతలు తమ వైసీపీ ప్రభుత్వం గురించి ఈవిదంగా మాట్లాడుతుంటే, ఏపీ మంత్రులు స్పందిస్తున్న తీరు విస్మయం కలిగిస్తుంది. పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె. రోజా కేటీఆర్‌ మా రాష్ట్రం గురించి అనలేదని సమర్ధించుకొంటే, మరో మంత్రి ‘దమ్ముంటే సంక్షేమ పధకాల అమలులో మాతో పోటీ పడాలంటూ’ సవాలు విసరడం విస్మయం కలిగిస్తుంది.