KCR Telangana TRSతెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ ను బలహీనపరచడంతో బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నాలుగు సీట్లు గెలుచుకుని మంచి ఊపు మీద ఉన్న ఆ పార్టీ తన నాయకత్వ సమస్య పూడ్చుకునే దిశగా అడుగులు కదుపుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పెద్ద నాయకుల మీద వల పన్నుతోంది. నిన్న కోమటిరెడ్డి సోదరులు, వివేక్, కొండా విశ్వేశ్వర రెడ్డి రహస్యంగా బీజేపీ అధినేత అమిత్ షా ను కలిసినట్టు సమాచారం.

ప్రాధమికంగా పార్టీలోకి వస్తే వారికి ఎటువంటి గౌరవాన్ని ఇస్తారు అనే దాని మీద చర్చ జరిగినట్టు సమాచారం. కోమటిరెడ్డి సోదరులు తమకంటే రాజకీయంగా జూనియరైన ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ గా చేసిన నాటి నుండి గుర్రుగా ఉన్నారు. ఉత్తమ్ స్థానం తమకు వస్తే తప్ప వారు పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తుంది. వివేక్ ఇటీవలే తెరాస నుండి కాంగ్రెస్ కు వచ్చారు. ఆయనకు తెలంగాణాలో పాపులరైన వీ6 మీడియా ఉండటం బీజేపీకి కలిసి వస్తుంది.

ఇక పోతే కొండా విశ్వేశ్వర రెడ్డికి రాజకీయంగా అనుభవం తక్కువైనా మంచి పేరు ఉంది. ఇటీవలే ఆయన చేవెళ్ల ఎంపీగా తిరిగి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే బీజేపీ క్యాంపులో జరిగే పరిణామాలను కాంగ్రెస్ తో పాటు తెరాస పార్టీ కూడా నిశితంగా పరిశీలిస్తుంది. బీజేపీ ఎదుగుదల తెలంగాణాలో తెరాసకు కూడా ప్రమాదమే. రాష్ట్రంలో తమకు అవకాశం ఉందంటే చంద్రబాబు నాయుడు లాగా కేసీఆర్ ని కూడా టార్గెట్ చేస్తుంది బీజేపీ అధినాయకత్వం. ఈ విషయం కేసీఆర్ కు బాగా తెలుసు.