TRS alerts with Greater Electionsగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపించే కొద్దీ అధికార తెరాస పార్టీ నేతలలో గుబులు మొదలయ్యింది. గత ఎన్నికలలో 2014లో మహానగరంలో మూడు స్థానాల్లో మాత్రమే టీఆర్‌ఎస్‌ ఆ తరువాత అధికారంలోకి వచ్చిన పిదప జరిగిన గ్రేటర్ ఎన్నికలలో 150 సీట్లలో భారీ స్థాయిలో 99 సీట్లు గెలిచింది. 100 రోజులలో గ్రేటర్ రూపు రేఖలు మారుస్తాం అని కేటీఆర్ పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు.

అయితే అవేమీ జరగకపోగా… నగరంలోని రోడ్లు, పారిశుధ్య వ్యవస్థ గతంలో ఎన్నడూ లేన్నంతగా పడిపోయాయి. వర్షం పడినప్పుడల్లా రోడ్ల మీద ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడకల ఇళ్ళ ప్రాజెక్టు కూడా పడకేసింది. నగర పరిధిలోని ఏ సెక్షన్ ప్రజలు కూడా సంతృప్తిగా లేరు.

దీనితో ప్రభుత్వం చివరి నిముషం నష్టనివారణ చేస్తుంది. గ్రేటర్‌ పాలకమండలికి సరిగ్గా మరో 16 నెలల సమయం ఉంది. ఫిబ్రవరి 11, 2016న కొలువుదీరిన కౌన్సిల్‌ గడువు ఫిబ్రవరి 10, 2021న ముగియనుంది. దానితో ఉన్నఫళంగా గ్రేటర్ పరిధిలోని కార్పొరేటర్లకు ఒక్కొక్కరికీ 50 లక్షల నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు సమాచారం.

“త్వరలో రూ.50 లక్షల కార్పొరేటర్‌ బడ్జెట్‌ విడుదల చేస్తాం.. మీ డివిజన్ల పరిధిలో అవసరమైన పనులు చేయించుకోండి. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలు పరిష్కరించండి,” అని మేయర్ స్వయంగా అధికార పార్టీ కార్పొరేటర్ల సమావేశంలో చెప్పుకొచ్చారు. దీనితో తెరాస ఎలాగైనా ఈ సారి కూడా గ్రేటర్ ను చేజిక్కించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా కనిపిస్తుంది.