trolls on KTR  traffic fines“సిగ్నళ్లు ఉన్న చౌరస్తాల్లో జీబ్రా లైన్ల వద్ద ఆగితే తప్పేంటి..? ఆగకపోతే పెనాల్టీ వేస్తే తప్పేంటి..? అసలు ఫుట్‌పాత్‌ మీద బండ్లు ఎందుకు నడపాలి..? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా నడిపే వాళ్లకు ఫైన్లు వేస్తే కామెంట్లు అంటే ఎట్లా..? నన్నడిగితే అలాంటి వారికి చలానాలు వేస్తే తప్పు లేదు” అంటూ కొత్తగా ఛార్జ్ తీసుకున్న మునిసిపల్ మంత్రి కేటీఆర్ కొత్త నియమనిబంధనలను వెనకేసుకొని వచ్చారు. ఈ క్రమంలో రోడ్లపై గుంతలు, పొంగిపొర్లే మురుగు… వంటి వాటికి ప్రభుత్వానికీ వేలు, లక్షల్లో జరిమానా వేయాలంటు సోషల్‌ మీడియాలో సందేశాలు వైరల్‌ అవుతున్నాయి.. మీ అభిప్రాయం ఏంటన్న విలేకరుల ప్రశ్ననించారు.

దీనిపై కేటీఆర్ స్ట్రెయిట్ గా సమాధానం చెప్పకుండా ఆ విషయం కాసేపు పక్కన పెట్టండి అంటూ దాట వేశారు. కొత్తగా అమలులోకి వచ్చిన జరిమానాలు గురించి మంత్రి గారు చెప్పింది పూర్తిగా కరెక్ట్. సివిక్ సెన్స్ అనేది అందరూ అలవరచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే ప్రజలు కట్టే పన్నులకు సమానంగా మెరుగైన ప్రమాణాలతో కూడిన రోడ్లు, పారిశుద్ధ్య ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం తన కర్తవ్యం నుండి తప్పించుకోలేదు. ప్రజలకు ఎంత బాధ్యత ఉంటుందో ప్రభుత్వానికీ అంతకంటే ఎక్కువ బాధ్యత ఉండాలి.

విశ్వనగరం అని చెప్పుకుంటూ మరో పక్క హైదరాబాద్ లోని రోడ్లు చూస్తే మన మీద మనకే జాలి కలగక మానదు. పారిశుధ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ. ఆ కారణంగా హైదరాబాద్ లో డెంగ్యూ విలయతాండవం చేస్తుంది. వీటినన్నింటినీ పక్కన పెట్టి ముందు సామాన్యులు, వారి సివిక్ సెన్స్ మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేస్తాం అంటే ఎలా? ఆ విషయం పక్కన పెట్టండి అంటూ దాట వెయ్యకుండా ప్రభుత్వానికి, ప్రజలకు ఉండే బాధ్యత రెండిటి గురించీ మాట్లాడితే ఇటువంటి ఉపన్యాసాలకు విలువ ఉంటుంది.