Trivikram Srinivas satire on Reviewsసిల్వర్ స్క్రీన్ పైన పంచ్ లను పేల్చడంలో ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పోటీపడి గెలవగలిగేవారు లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వెండితెరపై అన్ని పంచ్ లను పేల్చే త్రివిక్రమ్, ఆడియో వేడుకలకు వచ్చేసరికి చాలా ముక్తసరిగా, క్లుప్తంగా ప్రసంగిస్తుంటారు. అవి కూడా ఎక్కువ పంచ్ లు లేకుండా! కానీ చెప్పే ఒకటి, రెండు మాటలు కూడా ఎవరో ఒకటికి తగలక మానవు. అలా “లై” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పలికిన డైలాగ్స్ ఎవరికి తగలాలో వారికి తగిలాయి.

ఇదే వేదికపై సుకుమార్ ప్రసంగించిన సమయంలో… సహజంగా ఏ సినిమాకైనా ఇద్దరు దర్శకులు ఉంటారని, ఒకరు ఎడిటింగ్ రూమ్ లో కూర్చునే దర్శకుడు కాగా, మరొకరు సెట్స్ లో ఉండే దర్శకుడంటూ ఎడిటింగ్ బాధ్యతలను కీర్తిస్తూ వ్యాఖ్యానించారు. సరిగ్గా ఇవే మాటలను ఉదహరిస్తూ… సుకుమార్ ఓ విషయం మరిచినట్లున్నాడు… సినిమాకు ముగ్గురు దర్శకులు ఉంటారు… వీరిద్దరూ సినిమా రిలీజ్ కు ముందే ఉండే దర్శకులు కాగా, రిలీజ్ అయిన తర్వాత మూడో దర్శకుడు వస్తాడు అంటూ సెటైర్ వేసారు త్రివిక్రమ్.

ఇంతకీ ఆ పంచ్ ఎవరి మీద వేసారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా! సినిమాలు విడుదలయ్యాక రివ్యూలను అందించే సినీ విశ్లేషకులందరికీ కలిపి ఒకే సారి పంచ్ వేసాడు ఈ ‘మాటల మాంత్రికుడు.’ ఆ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఈ హీరో కంటే కూడా మరో హీరో అయితే బాగా చేసేవాడంటూ త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలకు దర్శకుడు సుకుమార్ తో సహా వేదికపై ఉన్న వారంతా నవ్వేసారు. అంతేకదా… పంచ్ మాస్టర్ పంచ్ పేలిస్తే… నవ్వు రాకుండా ఎలా ఉంటుంది మరి..!