Trivikram Srinivas coming to rescue mahesh babuప్రిన్స్ మహేష్ బాబుకు అర్జెంట్ గా ఓ బంపర్ హిట్ కావాలి. అవును… ‘బ్రహ్మోత్సవం, స్పైడర్’ ఇలా వరుసగా రెండు సినిమాలు తీవ్రంగా నిరుత్సాహపడిన తరుణంలో… మహేష్ బాబు చేసే సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండాలి. అయితే ఇప్పటికే ఓ రెండు సినిమాలకు ప్రిన్స్ కమిట్ అయ్యారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అనే నేను” సినిమా చేస్తుండగా, ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల వరకే ప్రిన్స్ కమిట్ అయ్యున్నారు.

అయితే ఆ తర్వాత కూడా పూరీ వంటి ఇతర దర్శకుల జాబితా ఉండగా, అందరినీ వెనక్కి నెట్టి త్రివిక్రమ్ ముందుకు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రిన్స్ – త్రివిక్రమ్ కాంబో అనేది అభిమానులకే కాదు, ట్రేడ్ వర్గాలకు కూడా ఓ క్రేజీ విషయం. సిల్వర్ స్క్రీన్ పై ‘అతడు’ ఓ క్లాసిక్ నిలిచిపోగా, ‘ఖలేజా’ బుల్లితెర క్లాసిక్ గా మారిపోయింది. దీంతో మూడవ సినిమా కోసం ప్రిన్స్ అభిమానులు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తుండగా, దీనిపై ఇప్పటికే ఓ అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

అయితే ఇది ఎప్పుడు కార్యరూపం సిద్ధించుకుంటుందో అన్న సందేహానికి “స్పైడర్” విడుదల తర్వాత ఓ క్లారిటీ వచ్చినట్లయ్యింది. మహేష్ కు ఓ సూపర్ హిట్ ఇవ్వడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రంగంలోకి దిగుతున్నాడు అనేది ఈ వార్తల సారాంశం. వంశీ పైడిపల్లితో మహేష్ సినిమా పూర్తి కాగానే, అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ పూర్తయిన తదుపరి వీరి కాంబో సెట్స్ పైకి వెళ్తుందనే వార్త, ప్రిన్స్ అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. ఇక ప్రిన్స్ తాజా సినిమా “భరత్ అనే నేను” ఈ నెల 15వ తేదీ నుండి తదుపరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.