trivikram-pawan-kalyan-chiranjeevi-combination-movieమెగాస్టార్ చిరంజీవి హీరోగా విజయ భాస్కర్ దర్శకత్వంలో “జై చిరంజీవ” సినిమా రూపొందుతుండగా, ఈ సినిమాకు మాటలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్, మరో పక్కన “అతడు” సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. “జై చిరంజీవ” విడుదల ఫ్లాప్ టాక్ ను తెచ్చుకోవడం, అలాగే “అతడు” హిట్టై అద్భుతం అనిపించుకోవడంతో… విజయభాస్కర్ – త్రివిక్రమ్ ల మధ్య విభేదాలు వచ్చినట్లుగా హల్చల్ చేసిన సంగతులు తెలిసినవే. ‘అతడు’ సినిమాపై పెట్టిన దృష్టి, ‘జై చిరంజీవ’పై త్రివిక్రమ్ పెట్టలేదన్న సమాచారం మెగాస్టార్ చిరంజీవి దాకా కూడా చేరిందని, ఈ విషయంలో చిరు సైతం కాస్త గుర్రుగా ఉన్నారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అప్పటి నుండి చిరంజీవి, త్రివిక్రమ్ లు మాట్లాడుకున్న సందర్భాలు బహు అరుదేనని చెప్పాలి. ఒకానొక సమయంలో చెర్రీతో సినిమా చేయాల్సిందిగా త్రివిక్రమ్ ను మెగాస్టార్ అడిగారని, ఆ సమయంలో కూడా ‘మాటల మాంత్రికుడు’ వేరే సినిమాతో బిజీగా ఉన్నారని, దీంతో వీరిద్దరికీ సెట్ కాలేదన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో బాగా వినిపించింది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యక్తిగతంగా దాదాపు రెండు గంటల పాటు ఏకాంతంగా మాట్లాడారని, దీని వెనుక ఆంతర్యం ఏమిటన్నది టాలీవుడ్ నాట ఆసక్తిగా మారింది.

బహుశా మెగాస్టార్ తదుపరి సినిమా కోసం జరిగిన చర్చలా? లేక రామ్ చరణ్ సినిమా కోసమా? అదీ కాకపోతే ప్రస్తుతం తెరకెక్కుతోన్న “ఖైదీ నంబర్ 150” సినిమా కోసం ఏమైనా సలహాలు తీసుకుంటున్నారా? కాదంటే… పవన్ జనసేన ఆంతరంగీక చర్చలా? ఇలా రకరకాల ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. కాస్త రహస్యంగా సాగిన ఈ సమావేశంలో వివరాలు బయటకు రాకపోవడంతో ఈ భేటీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే చిరు హీరోగా పవన్ నిర్మాతగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ భేటీ జరిగిందన్న సమాచారంలో వాస్తవం ఎంత ఉందో తెలియాలి.