traffic-police-gave-shock-to-hyderbad-mayor-bonthu-ram-mohanరూల్స్ పెట్టడమే కాదు, వాటిని ఆచరించి తీరాలి అన్న నిబంధనలు ఖచ్చితంగా అమలైనపుడు మాత్రమే పాలన సరైన రీతిలో సాగుతున్నట్లు! హైదరాబాద్ లో ద్విచక్ర వాహనంపై ప్రయాణించాలంటే ఖచ్చితంగా ‘హెల్మెట్’ ఉండాల్సిందేనని ఇటీవల అమలు చేస్తున్న రూల్ తెలిసిందే. అయితే సాధారణంగా ఇలాంటి నియమ నిబంధనలకు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రేటీలు, సంఘంలో పరపతి గలిగిన వ్యక్తులు అతీతులు. ఇలాంటి వారు ఎక్కడైనా కనపడినా… ‘నమస్తే’ పెట్టి వదిలేయడం తప్ప సహజంగా పోలీసులు ఏమి చేయరన్న విషయం ప్రజలకు సుపరిచితమే.

కానీ, హైదరాబాద్ పోలీసులు మాత్రం ఇందుకు విభిన్నంగా ఏకంగా నగర మేయర్ కే చలానా రాయడం విశేషం. బుధవారం నాడు రాత్రి సమయంలో బైక్ పై వెళ్తున్న నగర మేయర్ బొంతు రామమోహన్ హెల్మెట్ ధరించలేదని 100 రూపాయలు ఫైన్ విధించడం విశేషం. ఇక్కడ విషయం 100 రూపాయలు కాకపోయినా… రూల్స్ కు పెద్ద పెద్ద అధికారులు సైతం అతీతులు కారని పోలీసులు చాటిచెప్తున్నారు. నిజంగా ఇలాంటి పరిణామాలు జరిగితేనే ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. లేదంటే… ‘యధారాజా… తధా ప్రజా…’ మాదిరి తయారవుతుంది.