mahanati-box-office-collectionsఈ సమ్మర్ టాలీవుడ్ కు బాగా కలిసి వచ్చింది. ‘రంగస్థలం’తో మొదలైన విజయాల పరంపరను ‘మహానటి’ దిగ్విజయంగా కొనసాగిస్తోంది. ముఖ్యంగా యుఎస్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వసూలు కావడం తెలుగు సినిమా స్థాయిని సూచిస్తోంది. ‘రంగస్థలం’ 3.51 మిలియన్ డాలర్స్ వసూలుతో ఏకంగా ‘నాన్ బాహుబలి’ రికార్డు వశం కాగా, ‘భరత్ అనే నేను’ 3.40 మిలియన్ డాలర్స్ తో దాని తర్వాత స్థానంలో నిలిచింది.

ఈ రెండు పెద్ద సినిమాల తర్వాత విడుదలైన ‘నా పేరు సూర్య’ కనీసం 1 మిలియన్ డాలర్స్ కు కూడా చేరుకోలేక ఇబ్బందులు పడుతూ ప్రస్తుతం 740 కే వద్ద ఉండగా, “మహానటి” మాత్రం వీరవిహారం చేస్తూ ఏకంగా 1.5 మిలియన్ డాలర్స్ ను కైవసం చేసుకుని 2 మిలియన్స్ వైపుకు పరుగులు పెడుతోంది. ఈ సినిమా జోరు చూస్తుంటే, 2 మిలియన్స్ కేక్ వాక్ కాగా, ఆ పైన ఎంతవరకు వసూలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

‘మహానటి’ తర్వాత విడుదలైన పూరీ ‘మెహబూబా’ కనీసం 100కే ను కూడా చేరుకోలేక చతికిలపడిపోయింది. కంటెంట్ కరెక్ట్ గా ఉన్న సినిమాలకు యుఎస్ ప్రేక్షకులు ఇస్తోన్న తీర్పు అనిర్వచనీయం. ‘మహానటి’ విషయంలో పెట్టిన పెట్టుబడితో పోలిస్తే యుఎస్ బాక్సాఫీస్ వద్ద లాభాలు చాలా అధికంగా ఉన్నాయి. లాభాల షేర్ విషయంలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ను కూడా ‘మహానటి’ క్రాస్ చేసేసిందని చెప్పవచ్చు.