Tollywood Tier 1 Heroes కంటెంట్ గురించి ఎన్ని కామెంట్లు వచ్చినా రివ్యూలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండూ ఘనవిజయం సాధించడం ట్రేడ్ లో ఎక్కడ లేని ఉత్సాహాన్ని తెచ్చింది. కమర్షియల్ లెక్కల్లో చిరంజీవి విజేతగా నిలిచినప్పటికీ బాలయ్య రెవిన్యూ తక్కువేమీ కాదు. బీసీ సెంటర్లలో వీళ్ళ దూకుడు సహజమనుకుంటే హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ భారీ వసూళ్లు రాబట్టుకోవడం సీనియర్ స్టార్ల స్టామినాకు నిదర్శనం. బాలకృష్ణ అఖండ, అన్ స్టాపబుల్ సక్సెస్ లతో ఊపు కొనసాగిస్తే ఆచార్య గాయం గాడ్ ఫాదర్ యావరేజ్ ఫలితం నుంచి మెగాస్టార్ ఈ స్థాయి రికవరీ చూపించడం ఫ్యాన్స్ కి మాములు కిక్ ఇవ్వలేదు.

ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. చిరు బాలయ్య ఇద్దరూ అరవై వయసు దాటేశారు. ఖైదీ, మంగమ్మ గారి మనవడు టైంలో యూత్ వీరాభిమానులు ఇప్పుడు మనవలు మనవరాళ్ల పెళ్లి చేసే స్టేజికి వచ్చేశారు. అప్పటి చిన్న పిల్లలు మిడిల్ ఏజ్ క్రాస్ చేశారు. వీళ్లంతా తెల్లవారుఝామున బెనిఫిట్ షోల కోసం మూడు నాలుగు గంటలకు లేచి వచ్చే బాపతు కాదు. మొదటి రోజు లేదా ఆ తర్వాత చూసే క్యాటగిరీ. అయినా కూడా ఇంత రచ్చ జరగడానికి కారణం దశాబ్దాల తరబడి సృష్టించుకున్న కంచుకోట లాంటి ఇమేజ్, వారసత్వంగా ఆ లెగసిని మోస్తున్న తరవాతి తరం హీరోలకు ప్రత్యేకంగా యూత్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోవడం.

ఈ రెండూ కలిసి బాక్సాఫీస్ ని దున్నేయడానికి కారణం అయ్యాయి. కరోనా టైం నుంచి సరైన సంక్రాంతి టాలీవుడ్ కు పడలేదు. గత ఏడాది వృధా అయిపోయింది. ఓ మోస్తరుగా ఉన్న బంగార్రాజుని వేరే ఆప్షన్ లేక ఆడియన్స్ హిట్ చేసి పెట్టారు. అంతకు ముందు క్రాక్ ఒకదానికే సింహాసనం దక్కింది. మహమ్మారికి ముందు అల వైకుంఠపురములో – సరిలేరు నీకెవ్వరు సమఉజ్జీల క్లాష్ అదిరిపోయింది ఇప్పుడు వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డిల వంతు వచ్చింది. పెద్దవాళ్ళే ఈ స్థాయిలో రచ్చ చేస్తే ఇప్పటి జనరేషన్ స్టార్లు తలపెడితే అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పాలా. ఆది పురుష్ వచ్చేదే కానీ గ్రాఫిక్స్ వల్ల వాయిదా పడింది. లేదంటే సీన్ ఇంకోలా ఉండేదేమో.

వచ్చే సంవత్సరం టైర్ 1 సినిమాలు రావాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్ – శంకర్ కాంబో, ప్రభాస్ – మారుతీ ప్రాజెక్ట్, జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ(ఆలస్యమైన పక్షంలో), పుష్ప 2 ది రైజ్ (ఈ ఏడాది అనుమానమే) వీటిలో ఏది వచ్చినా అప్పుడు జరిగే వసూళ్ల భీభత్సం ఊహకందేది కాదు. చిరు బాలయ్యలే చెరో రెండు వందల కోట్లు తెచ్చే కెపాసిటీ చూపించినప్పుడు పైన చెప్పిన వాళ్ళు ఈజీగా ఆరేడు వందలు దాటించేస్తారు. అసలు ఆర్ఆర్ఆర్ మార్చిలో కాకుండా జనవరిలో వచ్చి ఉంటే ఇంకో అయిదు వందల కోట్లు ఎక్కువ వచ్చేవన్న కామెంట్ లో నిజముంది. చూస్తుంటే రాబోయే సంక్రాంతులు టాలీవుడ్ కు కొత్త కాంతులు తేవడం ఖాయమే.