Tollywood Ticket Ratesసినిమా పరిశ్రమ మనుగడకు ప్రభుత్వ సహకారాలు ఉండాల్సిందే. అది నిర్మాణంతో మొదలుకుని థియేటర్లలో అడుగు పెట్టే దాకా పలు దశల్లో అవసరం. కానీ తెలుగు రాష్ట్రాల్లో రెండు సర్కార్ల తీరు ఒకరిది బెల్లం మరొకరిది అల్లం అన్నట్టుగా సాగుతోంది. అత్యంత కీలకమైన సంక్రాంతి సీజన్ ని లక్ష్యంగా పెట్టుకుని వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలు మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్నాయి. తెలంగాణలో మొదటి రోజు ఆరు షోలకు అనుమతి ఇస్తూ అధికారికంగా జిఓ రిలీజ్ అయ్యింది. అది చిరంజీవి బాలకృష్ణ ఇద్దరి చిత్రాలకు వర్తించేలా ఆర్డర్స్ ఉన్నాయి.

టికెట్ రేట్లకు సంబంధించి ఇప్పటికే గరిష్ట పరిమితిని 295 రూపాయలకు ఎప్పుడో ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగానే మల్టీ ప్లెక్సులు ఆన్ లైన్ అమ్మకాలు మొదలుపెట్టాయి. కొందరు ఎగ్జిబిటర్లతో ఒప్పందాలలో ఆలస్యం జరుగుతున్నా ఫైనల్ గా అవి కూడా సర్దుబాటు అవుతాయి. రెండో రోజు నుంచి అయిదు ఆటలు ప్రదర్శించే వెసులుబాటు ఎలాగూ ఉంది. తెల్లవారుఝామున నాలుగు గంటలకు ప్రీమియర్లు వేయడం వల్ల కలుగుతున్న ప్రయోజనం లక్షల్లో కాదు కోట్లలో ఉంటుంది. గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న బాక్సాఫీస్ కి ఇది పెద్ద ఆక్సిజన్.

అటు చూస్తే ఏపీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఏడిపించి ఏడిపించి కాళ్లరిగేలా తిప్పించి కేవలం 25 రూపాయలు పెంపు ప్లస్ జిఏస్టికి పర్మిషన్ ఇచ్చారట. చివరి నిమిషం దాకా విపరీతమైన ఆలస్యం చేసి జిఓలు ఇవ్వడం వల్ల వసూళ్ల మీద ప్రభావం పడుతుందని థియేటర్ యాజమాన్యాలు టెన్షన్ పడుతున్నాయి. త్వరగా బుకింగ్స్ పెట్టడం వల్ల ప్రేక్షకులు డివైడ్ కాకుండా కాపాడుకోవచ్చు. అదనపు షోకి సైతం మైత్రి నిర్మాతలు విపరీతంగా ప్రయత్నిస్తున్నా సకాలంలో స్పందన రాలేనేది అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. వర్షం కురుస్తుందని తెలిసినప్పుడు గొడుగు ముందే ఇవ్వాలి కానీ పూర్తిగా తడిశాక ఇస్తే ఏం లాభం.

ప్రీ రిలీజ్ ఈవెంట్ల విషయంలోనూ జగన్ సర్కార్ అనుసరించిన ధోరణి ఇబ్బందులను తెచ్చి పెట్టింది. వీరసింహారెడ్డికి ఒంగోలులో ముందు ఒక చోట ఓకే చెప్పి తర్వాత మార్చడం ఎన్నో వ్యయప్రయాసలకు దారి తీసింది. వాల్తేరు వీరయ్యకి విశాఖపట్నంలోనూ ఇదే అనుభవం. ఇలా చివరి నిమిషం మార్పుల వల్ల ఈవెంట్ ఆర్గనైజర్స్ కు లక్షల్లో నష్టం తప్పలేదు. ఇండస్ట్రీ పెద్దలు ఈ పరిణామాలన్నీ గమనిస్తూ ఇకపై ఏపిలో కంటే తెలంగాణలో చేసుకోవడం సుఖమనే స్థిర అభిప్రాయానికి వస్తే దాని వల్ల కలిగే మేలు ఎవరికి. అయినా సవాలక్ష సమస్యలు ఉండగా ప్రభుత్వాలు సినిమా వ్యవహారాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.