Tollywood-Telugu-Musicఅవును. నిజంగా తెలుగు సినిమాకు కొత్త ఊపిరి కావాలి. తరం మారిందనో పాత అభిరుచులు ఇప్పుడు లేవనో సాకులు చెబుతూ ఇచ్చిందే పాట కొట్టిందే ట్యూనంటూ కలకాలం నిలిచిపోయే పాటలను ఇవ్వలేకపోతున్న సంగీత దర్శకులను నిందించాలో లేక అలాంటి అవుట్ ఫుట్ రాబట్టుకోలేకపోతున్న డైరెక్టర్లను నిలదీయాలో అర్థం కాని పరిస్థితికి బాధ్యత ఎవరిది. పాతికేళ్ల వయసున్న ఓ కుర్రాడి స్మార్ట్ ఫోన్ ప్లే లిస్టులో గీతాంజలి, అభినందన లాంటి ఇళయరాజా పాటలు ఉంటున్నాయి. హోటల్లో పని చేసే ఓ యువకుడికి ఇష్టమైన ఆల్బమ్స్ లో ముఠామేస్త్రి, సమరసింహారెడ్డిలు ఉన్నాయి. వీళ్ళు పుట్టకముందు వచ్చిన వాటికి ఎలా కనెక్ట్ అవ్వగలుగుతున్నారు.

మరీ వెనక్కు వెళ్లి ఘంటసాల హయాం నుంచి తవ్వాల్సిన అవసరం లేదు కానీ చక్రవర్తి, ఇళయరాజాలు తొంబై దశకాన్ని ఊపేసి ఆడియో మార్కెట్ ని కొత్త స్థాయికి తీసుకెళ్లారు. లహరి, ఆదిత్య, సుప్రీమ్ లాంటి కంపెనీల టర్నోవర్ ని లక్షల నుంచి కోట్లకు చేర్చారు. అదంతా ఒక మహర్దశ. కీరవాణి, రాజ్ కోటి, ఏఆర్ రెహమాన్ లు అంతకు మించి అనేలా స్థాయిని ఇంకా పెంచారు. మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్ ల జమానా ఇంకో గోల్డెన్ చాప్టర్. డిజాస్టర్లకు సైతం అదిరిపోయే పాటలను ఇచ్చేవాళ్ళు. ఇదంతా గతం. కొత్త రక్తం ప్రవేశించింది. తమన్, అనూప్ రూబెన్స్ ఎవరికి వాళ్ళు కొత్త శైలిని పరిచయం చేసే ప్రయత్నంలో బ్లాక్ బస్టర్స్ వీక్ చార్టర్స్ రెండూ ఇచ్చారు ఇస్తున్నారు.

క్యాసెట్లు సిడిలు పూర్తిగా కనుమరుగయ్యాక మొత్తం డిజిటల్ ప్రపంచంలో ప్రవేశించాక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హోరులో పాటల సౌండ్ తగ్గిపోయిన మాట వాస్తవం. కమల్ హాసన్ విక్రమ్ కు అనిరుద్ రవిచంద్రన్ ఇచ్చిన బీజీఎమ్ గురించి గొప్పగా మాట్లాడుకున్న మనమే ఓ పదేళ్ల అందులో పాట ఒకటి గుర్తు చేసుకోమంటే ఎంత జ్ఞాపకశక్తి ఉన్నా తలంపుకు రావడం కష్టం. బీస్ట్ లో అలమతి బిబోనో లేదా పేటలో టైటిల్ ట్రాక్ నో ఉదాహరణగా చెప్పొచ్చు కానీ మిగిలిన పాటల సంగతేంటంటే నీళ్లు నమలాల్సిందే. మన విషయానికి వద్దాం. అల వైకుంఠపురములో ఇచ్చిన తమనే సర్కారు వారి పాటతో నిరాశపరిచాడు. ఇస్మార్ట్ శంకర్ తో సిక్సర్ కొట్టిన మణిశర్మ మళ్ళీ ఫోర్ కొట్టిన ఎగ్జాంపుల్ లేదు. విదేశాల్లో ఉండే మిక్కీ జె మేజర్ మ్యూజిక్ లవర్స్ కు నల్లపూసైపోయాడు

అనూప్ రూబెన్స్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా తర్వాత అలాంటి మిలియన్ల పాట ఏది ఇచ్చాడు. అక్కినేని మనం టైంనాటి అతనిలో స్పార్క్ ఏమయ్యింది. సుకుమార్ బ్రాండ్ ఉన్న సినిమాలకు తప్ప మిగిలినవాటికి తన స్థాయి స్కోర్ ఇవ్వడం లేదని కామెంట్స్ ఎదురుకుంటున్న దేవిశ్రీ ప్రసాద్ దానికి ధీటైన సమాధానం ఎప్పుడు ఇస్తాడాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఒక ఆల్బమ్ లో అయిదారు పాటలు బాగుండటం అరుదైపోయింది. ఘంటాడి కృష్ణ, శశిప్రీతం లాంటి వాళ్ళు 2000 టైంలో ఒకే సినిమాలో అన్ని సాంగ్స్ బాగా కంపోజ్ చేసిన సందర్భాలున్నాయి. ఆర్పి పట్నాయక్ కు ఎవర్ గ్రీన్ పాటలు పడ్డాయి. ఆ స్పీడ్ మళ్ళీ ఇప్పుడు కావాలి. అలాంటి టాలెంట్ కొత్త తరం నుంచి బయటికి రావాలి. అప్పుడే టాలీవుడ్ సంగీతానికి ఆక్సీజన్ అందుతుంది