Bharat-Ane-Nenu-Rangasthalam-Naa-Peru-Suryaటాలీవుడ్ కు సంక్రాంతి కోలుకోలేని షాక్ ఇవ్వడంతో, అందరి చూపులు సహజంగానే సమ్మర్ వైపుకు మళ్ళాయి. మొదటగా విడుదలైన ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుని, సరికొత్త రికార్డులను కైవసం చేసుకుంది. ఆకలితో ఉన్న సినీ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచడంలో సక్సెస్ కావడంతో, ఏకంగా ‘నాన్ బాహుబలి’ రికార్డును కట్టబెట్టారు.

ఆ తర్వాత విడుదలైన ‘భరత్ అనే నేను’ కూడా సూపర్ సక్సెస్ అయ్యి, ఇప్పటికీ ధియేటర్లలో రన్ అవుతోంది. ఓవరాల్ గా ‘రంగస్థలం’ తదుపరి స్థానంలో ‘భరత్ అనే నేను’ నిలుస్తుందన్న సంకేతాలు కనపడుతున్నాయి. ఫెయిల్యూర్స్ లో ఉన్న మహేష్ బాబుకు ఈ ఫలితం చాలా ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. రెండేళ్ళ ప్రిన్స్ ఫ్యాన్స్ నిరీక్షణకు కూడా తెరపడింది.

ఇక మూడో భారీ చిత్రం “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” ఆశించిన ఫలితాన్ని అందుకోవడంలో పూర్తిగా విఫలమైందని, మూడు రోజుల ఓపెనింగ్ కలెక్షన్స్ చెప్పకనే చెప్పాయి. వరుస సక్సెస్ లలో ఉన్న బన్నీకి ‘డీజే’ ప్రతికూల ఫలితాన్ని ఇవ్వగా, ఈ ‘నా పేరు సూర్య’ మరింత డౌన్ అయ్యేలా చేసింది. బ్లాక్ బస్టర్ తో ప్రారంభమైన పెద్ద హీరోల సమ్మర్, ఫ్లాప్ తో ముగిసింది.

మిగిలినదంతా చిన్న సినిమాలు, చిన్న హీరోల హంగామానే! మరో రెండు రోజుల్లో ‘మహానటి’ రాబోతోంది. అక్కడ నుండి వరుసగా ప్రతి వారం సినిమాలు ఉన్నాయి గానీ, ప్రేక్షకులను ధియేటర్ల వైపుకు పరుగులు పెట్టించే విధంగా తీసుకువస్తాయా? లేదా? అన్నది చూడాలి. మళ్ళీ పెద్ద హీరోల సినిమాలు రావాలంటే దసరా వరకు వేచిచూడాల్సిందే.