తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు కాసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి చిత్రపరిశ్రమను ఆదుకోవాలని కోరారు. ఈ క్రమంలో లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వారికి హామీ ఇచ్చారు.

లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వారికి సూచించారు. తక్కువ మందితో, ఇండోర్ లో చేసే వీలున్న రీ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని, తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని చెప్పారు.

ఆ తరువాత పరిస్థితిని బట్టి థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చెయ్యాలనేది మీద ఒక నిర్ణయానికి వద్దాం అని ఆయన చెప్పుకొచ్చారు. ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని, ఆ తరువాత అవసరమైన అధికారిక ఉత్తరువులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

దీనితో ఇప్పుడు బంతి అధికారుల కోర్టులో పడింది. ఎంత త్వరగా ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేసి ఉత్తరువులు ఇస్తారు అనేది చూడాలి. ఏది ఏమైనా ఇండస్ట్రీని పునరుద్దరించే దిశగా ముందడుగు పడటంతో పరిశ్రమ మీద ఆధారపడిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు.