C Kalyan- Dil Raju- Talasani Srinivas Yadavతెలుగు చిత్ర నిర్మాతల కీలక సమావేశం శుక్రవారం జరగబోతోంది. సమావేశం యొక్క ప్రధాన ఎజెండా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగులను ఎలా ప్రారంభించాలో మరియు నిర్వహించాల్సిన నిబంధనలను చర్చించడం. షూటింగులు అనుమతించేలా వారు ఒక సమగ్ర ప్రతిపాదన ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

థియేటర్లు తెరిచి సినిమాలు విడుదల చెయ్యడం పై ఒక రోడ్‌మ్యాప్ గురించి కూడా వారు చర్చించనున్నారు. అయితే సమీప భవిష్యత్తులో సినిమా థియేటర్లను తెరవడానికి ప్రభుత్వం అనుమతించే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మీటింగ్ సందర్భంగా ఈ సంక్షోభంలో నిర్మాతలకు సహాయపడేందుకు పారితోషికాలను తగ్గించాలని స్టార్ నటులు, దర్శకులను కోరతారని సమాచారం.

ఇప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీ కొందరు తమ రెమ్యూనరేషన్ తగ్గించడానికి ముందుకు రాగా, టాలీవుడ్ లో అటువంటి వాతావరణం కనిపించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 29 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం మన పాఠకులకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ మాత్రం 17 తరువాత కేంద్రం ఎలా చెబితే అలా చేసే ఉద్దేశంలో ఉంది.

జూన్ మొదటి వారం నుండి షూటింగులు అనుమతించే అవకాశం ఉందని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే సూచించారు. దీనితో తెలుగు చలన చిత్ర ప్రముఖుల ఆశలు చిగురించాయి. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.