nani-tollywood-no1-heroతెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అత్యంత క్లిష్టమైన ప్రశ్న ఏమిటంటే… “నెంబర్ 1 హీరో ఎవరు?” ఈ ప్రశ్నకు అభిమానుల వద్ద అయితే సమాధానం దొరుకుతుంది గానీ, సినీ వర్గాలు మాత్రం ఈ ప్రశ్నపై నోరు మెదపరు. ఎవరి పేరు చెప్తే ఎవరికి కోపం వస్తుందో అన్న భావన ఉండడంతో… సాధారణంగానే ఈ ప్రశ్నకు దాటవేసే సమాధానాలు ఇస్తుంటారు. కానీ, ఈ ప్రశ్నకు ఓ జవాబు ఉంది. ఆ జవాబు కూడా కాలక్రమేణా మారుతూ ఉంటుంది. కాలం మారినట్లే… నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న హీరోల పేరులో కూడా మార్పులు వస్తున్నాయి.

ప్రస్తుతానికి తెలుగు సినీ పరిశ్రమ నెంబర్ 1 హీరో ఎవరంటే… ‘నాచురల్ స్టార్’ నాని అనే చెప్పాలి. ‘ఎవడే సుబ్రమణ్యం’తో ప్రారంభమైన నాని ప్రభంజనం ‘మజ్ను’ వరకు నిరంతరాయంగా కొనసాగుతుండడంతో ఈ స్థానంలోకి వచ్చేసాడు నాని. అవును… నాడు చిరంజీవికి ఎందుకు నెంబర్ 1 స్థానాన్ని కట్టపెట్టారో… అదే సూత్రంతో నానికి కూడా ప్రస్తుతం నెంబర్ 1 స్థానం దక్కింది. అప్పట్లో చిరు ఒక్కరే వరుసగా విజయాలు సాధించేవారు కనుక, మెగాస్టార్ కు ఆ హోదా వరించింది.

ప్రస్తుత కాలంలో నాని ఒక్కడే అలా వరుసగా సక్సెస్ లను చవిచుస్తూ… ఆ సంఖ్యను ‘మజ్ను’తో 5కు పెంచుకున్నాడు. ఒక్క సక్సెస్ కోసం కొన్ని సంవత్సరాల నుండి కష్టపడుతున్న సినీ వారసులు ఉన్నారు. ఆలాంటి తరుణంలో ఒక సాధారణ హీరో… కామన్ మ్యాన్ కు ప్రతిబింబంలా నిలిచే వ్యక్తి… డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ లు కొట్టే విధంగా అడుగులు వేయడమంటే… ఖచ్చితంగా నాటి ‘మెగాస్టార్’ హోదా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పకతప్పదు. మెగాస్టార్ వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళ పాటు ఆ స్థానంలో వరుస కమర్షియల్ సక్సెస్ లతో రవితేజ నిలువగా, తాజాగా నాని ఆ సక్సెస్ లను అందిపుచ్చుకుంటున్నాడు.

నిజానికి నాని సక్సెస్ రేంజ్ విలువ పెద్దగా ఉండకపోవచ్చు. కానీ, పెట్టిన పెట్టుబడులకు రెండు, మూడు రెట్లు రాబడి ఏ పెద్ద హీరోకు వస్తుంది? అగ్ర హీరోల సినిమాలు వందల కోట్లు వసూళ్లు చేసి ఉండొచ్చు. కానీ, పెట్టిన పెట్టుబడులకు నష్టాలు లేకుండా ఉంటాయోమో గానీ, రెండు, మూడు రెట్లు లాభాలు అనేది ‘కల’ అని బల్లగుద్ది చెప్పవచ్చు. ఇటీవల 100 కోట్లు గ్రాస్ వసూళ్లు దాటిందని ప్రచారం జరుగుతున్న ‘జనతా గ్యారేజ్’కు అయిన పెట్టుబడి ఎంత? వచ్చిన రాబడి ఎంతో? లెక్కింపులు చేస్తే… ఆ సినిమా సక్సెస్ రేంజ్ తెలుస్తుంది.

ఆ అంశాలను పరిగణనలోకి తీసుకున్నా… నాని అందరి స్టార్ హీరోల కన్నా ఓ రెండు, మూడు అడుగులు పైనే ఉన్నాడని చెప్పవచ్చు. దీంతో ప్రస్తుతం మోస్ట్ క్రేజీ హీరోగా నాని అవతరించాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్టార్ హీరోల మాదిరే ఒక వీక్ కధను కూడా తన భుజాన వేసుకుని, సినిమాను మోయగాలనని ‘మజ్ను’ ద్వారా నిరూపించాడు. అలాగే స్టార్ హీరోలు చేయలేని విధంగా ప్రయోగాత్మక సినిమా కధలను కూడా చేయగలనని, నాని గత సినిమాలు నిరూపించాయి. నిజానికి ఇలాంటి వారే తెలుగు సినీ పరిశ్రమకు నెంబర్ 1 కావాలి. అప్పుడే సినీ పరిశ్రమ కూడా కలకాలం వర్ధిల్లుతుంది.