Tollywood Movies Releasing in December 2022చిన్న సినిమాలకు మీడియం రేంజ్ చిత్రాలకు మహా గడ్డుకాలం నడుస్తోంది. ఏదో ప్యాషన్ తో తీయడం, తీరా రిలీజ్ చేద్దామంటే సవాలక్ష వంకలతో బయ్యర్లు ముందుకు రాకపోవడం, ఇండస్ట్రీలో ఉన్న పెద్దల చేతుల్లో ఉన్న థియేటర్లలో బొమ్మను వేసుకోవాలంటే చిత్ర విచిత్ర కండీషన్లకు తలొగ్గాల్సి రావడం చెప్పుకుంటూ పోతే కర్ణుడి చావు కంటే ఈ కారణాలతో పెద్ద లిస్టు అవుతుంది. పోనీ ఓటిటికి ఇద్దామా అంటే అవి మరీ అన్యాయంగా తయారయ్యాయి. రెండు కోట్లు పెట్టి తీసిన సినిమాకు కోటి ఇస్తామని ఒకరు, ముందు మా ప్లాట్ ఫార్మ్ లో పెట్టండి వ్యూస్ ని బట్టి రెవిన్యూ షేర్ చేసుకుందామని మరొకరు, థర్డ్ పార్టీని తీసుకురండని ఇంకొకరు ఇలా ఎన్నెన్నో వింతలు

అందుకే ఇష్టం ఉన్నా లేకపోయినా కనీసం పెట్టుబడి వస్తుందన్న గ్యారెంటీ లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో స్వంత ఖర్చులతో రిలీజ్ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది చివరి నెలలో ఇవి మరీ చేపల మార్కెట్ లో అమ్మకాల్లా ఒకేసారి ప్రేక్షకుల మీద దాడి చేయబోతున్నాయి. డిసెంబర్ లో బజ్ ఉన్నవి, ఓపెనింగ్స్ వచ్చేందుకు అవకాశం ఉన్నవి కేవలం హిట్ 2, ధమాకా, 18 పేజెస్ లు మాత్రమే. ఇవి కూడా మార్నింగ్ షోలకు టాక్ వస్తేనే నిలబడగలిగే ఛాన్స్ ఉన్నవి. ఒకవేళ కొంచెం అటుఇటు అయినా హీరోలు బ్యానర్ల ఇమేజ్ లు ఓ వారం దాకా ఏదోలా నెట్టుకొస్తాయి. కానీ అసలు ఇవి తీశారని తెలియనివి ఇరవైకి పైగానే ఉన్నాయంటే షాకే

నీవెవరో, ప్రేమదేశం, చెప్పాలని ఉంది, కోరమీను, లెహరాయి, నమస్తే సేట్ జీ, హిడింబ, టాప్ గేర్ ఇలా క్యూ చాంతాడంత ఉంది. ఈ పేర్లు వినగానే కనీసం హీరో ఎవరో గుర్తుకు వచ్చినా మీకు మంచి టాలీవుడ్ నాలెడ్జ్ ఉన్నట్టే. వీటికన్నా డిస్ట్రిబ్యూటర్లు హాలీవుడ్ మూవీ అవతార్ 2 మీదే బోలెడు ఆశలు పెట్టుకున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రవితేజ సమర్పకుడిగా వ్యవహరించిన విష్ణు విశాల్ మట్టి కుస్తీని మన ఆడియన్స్ ప్రస్తుతానికి పట్టించుకున్న దాఖలాలు లేవు. కర్ణాటక ట్రాన్స్ పోర్ట్ దిగ్గజం విజయానంద్ జీవితకథని అదే పేరుతో తెరకెక్కించిన బయోపిక్ తెలుగు జనానికి కనెక్ట్ కావడం అనుమానమే. ప్యాన్ ఇండియా కలర్ బాగానే ఇస్తున్నారు.

ఇవి కాకుండా మంచి క్యాస్టింగ్ ఉన్న పంచతంత్రం లాంటి ప్రామిసింగ్ సినిమాలు కూడా బజ్ కోసం పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. అసలు కరోనా అనేదే రాకపోయి ఓటిటి విప్లవం ఈ స్థాయిలో పీక్స్ కి చేరకపోయి ఉంటే థియేటర్ల మనుగడ ఇంకొంచెం మెరుగ్గా ఉండేదన్న మాటలో నిజం లేకపోలేదు. ఒక ఫ్యామిలీ మొత్తం టికెట్లు, ఇంటర్వెల్ లో స్నాక్స్ కొనే ఖర్చుతో రెండు మూడు ఓటిటిల ఏడాది చందా కట్టే సీన్ ఉందిప్పుడు. అలాంటప్పుడు కేవలం టైంపాస్ కోసమో ఏసిలో సేదతీరడం కోసమే మునుపటిలా జనం రావడం లేదిప్పుడు. అందుకే చిన్న సినిమాలకీ అవస్థలు. చేపల మార్కెట్ ని తలపిస్తున్న డిసెంబర్ లో నిలిచేదెవరో పడిపోయేదెవరో