Nannanku prematho dictatorటాలీవుడ్ 2016 సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాలు ఖరారయ్యాయి. జనవరి 13 – నాన్నకు ప్రేమతో, 14 – డిక్టేటర్, 15 – సోగ్గాడే చిన్నినాయనా చిత్రాలు విడుదల కానున్నాయి. మూడు చిత్ర యూనిట్ లు ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాయి. గత అయిదారు సంవత్సరాలను పరిశీలిస్తే, మూడు రోజుల గ్యాప్ లో మూడు పెద్ద చిత్రాలు విడుదలైన దాఖలాలు లేవు. దీంతో ఈ సారి సంక్రాంతి సినిమాల పోటీ రంజుగా మారింది.

ఈ బరిలో నిలిచే ‘విజేత’కు కాసుల వర్షం కురవడం ఖాయం కావడంతో… మూడు చిత్ర యూనిట్ లకు టెన్షన్ పట్టుకున్నట్లే. అయితే ఈ 3 సినిమాలు కూడా మూడు డిఫరెంట్ జోనర్స్ కావడం ప్రేక్షకులకు కలిసి వచ్చే అంశం. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేయగా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘డిక్టేటర్’ మాస్ ప్రేక్షకులకు మొదటి ‘ఛాయిస్’గా మారనుంది. ఇక, సుకుమార్ ఎఫెక్ట్ తో “నాన్నకు ప్రేమతో” యూత్ ను టార్గెట్ చేసినట్లు అనిపించినా, ఇప్పటివరకు ఈ సినిమా ఏ జోనర్ అన్నది రివీల్ కాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు వహించింది. అయితే “1 నేనొక్కడినే” సినిమా ప్రభావంతో “నాన్నకు ప్రేమతో”పై యూత్ ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.

ఈ ముగ్గురి హీరోలను పరిశీలిస్తే… ఖచ్చితంగా సక్సెస్ కావాల్సిన అవసరం జూనియర్ ఎన్టీఆర్ కే ఉంది. అల్లు అర్జున్ వంటి హీరోలు సైతం 50 కోట్ల క్లబ్ ను క్రాస్ చేయగా, జూనియర్ ఖాతాలో ఒక్కటి కూడా లేకపోవడం ప్రతిష్టాత్మకంగా మారింది. కెరీర్ లో 25వ చిత్రంగానే కాక, “నాన్నకు ప్రేమతో” సక్సెస్ జూనియర్ కెరీర్ కు చాలా కీలకంగా మారింది. దీంతో మిగిలిన రెండు చిత్రాల కంటే కూడా సినీ ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా “నాన్నకు ప్రేమతో” చిత్రంపై మళ్లుతోంది. బహుశా ఆడియో విడుదల రోజు రిలీజ్ కాబోయే ధియేటిరికల్ ట్రైలర్ తో కొంత క్లారిటీ వస్తుందని ట్రేడ్ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడు చిత్రాలను పరిశీలిస్తే… ‘బుడ్డోడు’ అభిమానుల్లో కాస్త ‘టెన్షన్’ వాతావరణం ఎక్కువగానే ఉంది మరి!