Tollywood Movies Fake recordsఇండియన్ సినీ పరిశ్రమలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్… ఇలా విభిన్న రకాల చిత్ర పరిశ్రమలు ఉండగా, ఏ చిత్రసీమలో లేని విధంగా ఒక్క టాలీవుడ్ లో మాత్రమే సినిమా కలెక్షన్స్ పై ఎప్పుడూ రగడ జరుగుతూ ఉంటుంది. అగ్ర హీరోల సినిమాలు విడుదలయ్యాయంటే చాలు… ఫ్యాన్స్ కు పండగే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అందుకు తాజా ఉదాహరణలే జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” మరియు ప్రిన్స్ మహేష్ బాబు “స్పైడర్” చిత్రాలు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు “కలెక్షన్స్ యుద్ధం” చేసుకుంటున్నారు.

అందులో భాగంగానే “జై లవకుశ”కు సంబంధించి తాజాగా 125 కోట్ల పోస్టర్ విడుదల కాగా, “స్పైడర్” సినిమా 100 కోట్లు దాటేసిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ యుద్ధ వాతావరణానికి ప్రధాన కారణం… టాలీవుడ్ లో రికార్డులపై ఉండే మోజు బహుశా మరే చిత్ర పరిశ్రమలో ఉండదని చెప్పడంలో సందేహం లేదు. రికార్డులు అంటే ఇష్టం ఉండని హీరో ఎవరు ఉండరు. తాము నటించే ప్రతి సినిమా సరికొత్త రికార్డులు సృష్టించాలనే భావనను ఆడియో వేడుకలపై, ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో విచ్చేసిన అతిధులతో సహా హీరోలు కూడా వ్యక్తం చేస్తుండడంతో, అభిమానులు కూడా ఆ దిశగానే ఆలోచనలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు ‘ట్వీట్లు’ రువ్వుకుంటున్నారు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే… ఇది కేవలం పెద్ద సినిమాలకే పరిమితమవుతోంది. ఇటీవల శేఖర్ కమ్ముల “ఫిదా” మరియు విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి” సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించాయి. “ఫిదా” అయితే ఏకంగా 50 కోట్లు దాటేసిందని, అలాగే “అర్జున్ రెడ్డి” 40 కోట్లు పైనే వసూలు చేసిందని మీడియా వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఏ ఒక్క సినీ అభిమాని కూడా ఈ కలెక్షన్స్ విషయంలో రాద్ధాంతం చేయలేదు. కానీ ‘జై లవకుశ’ మరియు ‘స్పైడర్’ల విషయానికి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసుకుంటున్నారు. దానికి తోడు ‘జై లవకుశ’ యావరేజ్ టాక్ మరియు ‘స్పైడర్’ ఫ్లాప్ టాక్ రన్ అవుతుండడంతో… దీనికి మరింత ఆజ్యం పోసినట్లయ్యింది.

‘సూపర్ హిట్’ లేక ‘బ్లాక్ బస్టర్’ టాక్ వస్తే… బహుశా కలెక్షన్స్ విషయంలో ఇంత చర్చ జరిగేది కాదేమో. కానీ ‘యావరేజ్’ అండ్ ‘ఫ్లాప్’ టాక్ లు వస్తేనే 125 కోట్లు, 100 కోట్లు వచ్చేస్తే… మరి ‘సూపర్ హిట్’ టాక్ వస్తే ‘బాహుబలి 2’ను కూడా దాటేస్తారా? అంటూ నోరెళ్ళబెట్టడం సాధారణ ప్రేక్షకుల వంతవుతోంది. అలాగని ఈ 125, 100 కోట్లు ఎక్కడెక్కడి నుండి వచ్చాయన్నది చెప్పమంటే… ఆయా హీరోల అభిమానులు కూడా అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాదిలో సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ “దువ్వాడ జగన్నాధమ్” పరిస్థితి కూడా ఇంతే. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో జరిగిన రచ్చ తెలియనిది కాదు.

తమ హీరో సినిమాలే బాక్సాఫీస్ వద్ద రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలనే భావనలో అభిమానులు… వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తున్న హీరోలదే ఈ తప్పంతా అని చెప్పకతప్పదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. వారి సినిమాల కలెక్షన్స్ లో లేని రగడ ఇక్కడెందుకు జరుగుతోందో గుర్తించాల్సిన అవసరం మన అతిరధ మహారధులైన అగ్ర హీరోలకు ఉంది. అలాగే పొరుగున ఉన్న తమిళనాడులో కూడా అజిత్ – విజయ్ అభిమానుల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. కానీ కలెక్షన్స్ విషయంలో ఇంత హంగామా ఉండదు. ఎంత ఎక్కువ రచ్చ జరిగితే… ఫేక్ రికార్డులకు అంత ఎక్కువ అవకాశాలు ఏర్పడుతున్నాయని మన టాలీవుడ్ నిదర్శనంగా నిలవడం శోచనీయం.