పాలక – ప్రతిపక్ష నేతల మధ్య వాడి వేడిగా జరిగే అసెంబ్లీ సమావేశాలలో సీఎం కేసీఆర్ తెలుగు సినిమాలలో వాడే తెలంగాణ “భాష – యాస”ల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఒకప్పుడు తెలుగు సినిమాలలో తెలంగాణ యాసను కమెడియన్ల పాత్రలు పోషించే వారికి వాడేవారని, కానీ ఇప్పుడు సినిమాలలో ముఖ్యపాత్రలు పోషించే “హీరో – హీరోయిన్లు” వాడుతున్నారని, అది తెలంగాణ భాషపై మనం సాధించిన పట్టు అని పేర్కొన్నారు.
తెలుగు సినిమా విజయానికి మన తెలంగాణ భాష ఒక ఆయువుపట్టుగా మారిందని, తెలంగాణ యాస వాడిన చిన్న, పెద్ద సినిమాలు అన్ని దాదాపుగా విజయం సాధిస్తున్నాయని తెలంగాణ యాస గురించి చెప్పి తెలంగాణ ప్రజల భావోద్వేగాన్ని మరోసారి తట్టి లేపారు సీఎం కేసీఆర్. స్వయంగా ఒక ముఖ్యమంత్రి సినిమాలలోని వాడే భాషను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం అనేది సినీ మాధ్యమానికి సీఎం కేసీఆర్ ఇస్తోన్న ప్రాధాన్యతను సూచిస్తోంది.
పేద వాళ్లకు అందుబాటులో టికెట్లు రేట్లు అని చెప్పి సినీ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేసిన వైనం తెలిసిందే. ఎట్టకేలకు కంటితుడుపు చర్యగా కొత్త జీవో వచ్చినప్పటికీ, అందులో ఉన్న ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’ ఇండస్ట్రీ వర్గాలకు రుచించడం లేదు. బహిరంగంగా వీటిపై ప్రస్తుతం వ్యాఖ్యలు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఏపీలో వాతావరణం స్తబ్దుగా ఉంది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ విచ్చేసిన సమయంలో కూడా తెలుగు సినిమా ఖ్యాతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలా తెలుగు సినిమా వెలిగిపోవడానికి ప్రధాన కారణాలలో, కేసీఆర్ చెప్పినట్లు తెలంగాణా భాష – యాస కూడా ఓ కారణం కావచ్చు. కానీ ప్రభుత్వ పరంగా సినీ ఇండస్ట్రీని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఉండడం అనేది అసలు విషయం.
రెండు తెలుగు రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులు సినీ ఇండస్ట్రీకి ఇస్తోన్న ప్రాధాన్యత ఈ సందర్భంగా చర్చనీయాంశమైంది. సృజనాత్మకతకు నిదర్శనంగా పేర్కొనే సినీ ప్రపంచానికి తగినంత స్వాతంత్య్రం ఇస్తేనే, అది వెండితెరపై అద్భుతంగా కనపడుతుంది. అలా కాకుండా నియంత్రణలకు లోబడి షూటింగ్ లు చేయాల్సి వస్తే, ఆ బలవంతపు సృజనాత్మకత తెరపై ఎలా ఉంటుందో?!