Rebel-Star-Krishnam-Raju-Garu-Last-Journey-పోకిరి సినిమాలో విలన్‌తో ఓ సంద‌ర్భంలో ‘ప‌నేంటో చెప్పు.. నీకెంత‌.. నాకెంత‌’ చెప్పు అని మ‌హేష్ బాబు అంటాడు. ఇప్పుడీ డైలాగ్ ఎందుకా! అనే అనుమానం రావ‌చ్చు. అస‌లు విష‌య‌మేమంటే.. పూరి జ‌గ‌న్నాథ్ ఏ సంద‌ర్భంలో ఈ డైలాగ్ రాశాడో తెలియ‌దు కానీ.. సినీ ఇండ‌స్ట్రీ సిట్యువేష‌న్ అలాగే ఉంది. అంద‌రూ లెక్క‌లు వేసుకుని ముందుకు వెళుతున్నారు. బ‌య‌ట‌కు సినిమా ఇండ‌స్ట్రీ అంతా ఒక్క‌టే అని అంటుంటారు. అంద‌రం సినిమా పరిశ్ర‌మ‌ను డెవ‌లప్ చేయ‌టానికే ఉన్నాం అని చెబుతుంటారు. కానీ రియాల్టీలో మాత్రం అలా లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు గుంభ‌నంగా ఉన్న ఈ విష‌యం.. కృష్ణంరాజు మ‌ర‌ణం త‌ర్వాత బ‌య‌ట‌ప‌డింది

ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్ త‌ర్వాత సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి నిల‌దొక్కుకున్న వారిలో కృష్ణ‌, శోభ‌న్ బాబు, కృష్ణంరాజు ముఖ్యులు. వీరిలో ఇప్ప‌టికే శోభ‌న్ బాబు చ‌నిపోయారు. ఇక మిగిలిన వారిలో కృష్ణ‌, కృష్ణంరాజు మాత్ర‌మే పెద్ద దిక్కు. అలాంటి వారిలో కృష్ణంరాజు చ‌నిపోతే సినీ ప్ర‌ముఖులు చాలా మంది వ‌చ్చారు. నివాళులు అర్పించారు. అయితే ఆయ‌న న‌ట వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌భాస్ ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో టాప్ హీరోగా రాణిస్తున్నారు. కాబ‌ట్టే చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని మెయిన్ హీరోలంద‌రూ వ‌చ్చార‌ని, లేకుంటే ఎవ‌రూ ప‌ట్టించుకునే వారే కాద‌ని గుస గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇలాంటి వార్త‌లు రావ‌టానికి కార‌ణాలేంట‌ని చూస్తే.. కృష్ణంరాజు వంటి సినీ పెద్ద చ‌నిపోయారు. అంద‌రూ మైకుల ముందు కృష్ణంరాజు గొప్ప‌వాడు. అతిథి మ‌ర్యాద‌లు చేయ‌టంలో ఆయ‌న్ని మించినోడు లేడంటూ పొగిడేశారు. కానీ నిజానికి ఆయ‌న‌కు ఘ‌న‌మైన నివాళి ఇవ్వ‌లేదు. అలా చేయాలనుకుని ఉండుంటే .. గౌర‌వం కోసం క‌నీసం ఒక‌ట్రెండు రోజులు షూటింగుల‌ను ఆపి ఉండేవారు. కానీ అలా చేయ‌లేదు.

ఒక‌వైపు చిరంజీవి, మ‌రో వైపు మ‌హేష్ వంటి అగ్ర హీరోలు 24 గంట‌లు గ‌డ‌వ‌క ముందే.. ఆయ‌న ద‌హ‌న సంస్కారాలు పూర్తి కాక ముందే త‌మ సినిమాల‌కు సంబంధించిన షూటింగ్స్‌ షురూ చేశారు. ఇక బాల‌కృష్ణ 107 షూటింగ్ అయితే అస్స‌లు ఆపనేలేదు. చిరు, బాల‌య్య సినిమాల‌కు సంబంధించి యూనిట్ స‌భ్యులు.. కృష్ణంరాజు ప‌టం పెట్టి నివాళులు అర్పించి షూటింగ్ జరుపుకున్నారు. మ‌హేష్ సినిమా విష‌యంలో అది కూడా లేదు. భారీ బ‌డ్జెట్ సినిమాలు క‌దా.. షూటింగ్స్ వాయిదా వేస్తే స్టార్స్ డేట్స్ దొర‌క‌టం క‌ష్టం క‌దా! అనొచ్చు. ఒక‌వేళ వారి వాద‌న క‌రెక్టే అనుకుందాం. అలాంట‌ప్పుడు సైలెంట్‌గా షూటింగ్స్ చేసుకుని ఉండుంటే స‌రిపోయుండేది. కానీ అలా ఎవ్వ‌రూ చేయ‌లేదు. షూటింగ్స్ జ‌రుపుకుంటున్న‌ లొకేష‌న్స్‌కు సంబంధించిన ఫొటోల‌ను విడుద‌ల చేశారు. ఇలాంటి చర్యలపై కొంద‌రు బాహాటంగానే పెద‌వి విరుస్తున్నారు.

సినీ పెద్ద‌లు, స్టార్సే ఇలా ఉన్నార‌నుకుంటే మీడియా కూడా అలాగే త‌యారైంది. మీడియా ఫోక‌స్ అంతా ప్ర‌భాస్‌ను క‌లుస్తున్న స్టార్స్‌, ఆయ‌న్ని ఓదారుస్తున్న వారికి సంబంధించిన వార్త‌ల‌నే క‌వ‌ర్ చేయ‌టంపైనే ఉండింది. ప్ర‌భాస్ ఎమోష‌న‌ల్ మూమెంట్స్‌ను క‌వర్ చేయ‌టానికే మీడియా పోటీ ప‌డింద‌నే టాక్ కూడా బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌భాస్ అనే ఓ పెద్ద స్టార్ హీరో లేకుండా ఉండుంటే కృష్ణంరాజు వంటి లెజెండ్రీ యాక్ట‌ర్‌ను ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకునే వారే కాదు. ఎవ‌రూ ఔన‌న్నా, కాద‌న్నా ఇది మింగుడుప‌డ‌ని క‌ఠోర స‌త్యం. ఇదే విష‌యాన్ని రామ్ గోపాల్ వ‌ర్మ త‌న ట్వీట్స్ ద్వారా ప్ర‌శ్నిస్తూ..సినీ పెద్ద‌ల‌ను నిల‌దీశారు.

ఎవ‌రేమంటే మాకేంటి.. మాదారి మాదే.. మా లెక్క మాదే అనే చందాన ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీ తయారైంది. ఇది కాద‌నలేని వాస్త‌వం. డ‌బ్బు, పేరు, ప్ర‌తిష్ట‌, ప‌లుకుబ‌డి, బ‌ల‌మైన వార‌సులు ఉంటేనే ఇక్క‌డ గుర్తింపు ఉంటుంది. లేకుంటే ఎవ్వ‌రూ దెక‌రు. సినీ ఇండ‌స్ట్రీ అంతా లెక్క‌ల మ‌యంగా మారిపోయింది. అనుబంధాలు, ఆప్యాయత‌లు క‌రువైయ్యాయి. నీకెంత‌.. నాకెంత‌.. నీ సినిమా గొప్పగా ఆడిందా.. లేక నా సినిమా గొప్ప‌గా ఆడిందా! అనే కాలిక్యులేష‌న్స్‌తోనే టాలీవుడ్ ర‌న్ అవుతుంది. ఆ విష‌యం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్ట‌య్యింది.