టాలీవుడ్ హీరోల చదివింపుల "పర్వం"ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినీ పరిశ్రమ ఎప్పటికి కోలుకుంటుందో తెలియదు గానీ, జగన్ సర్కార్ పై పోరాటం చేసే ఉద్దేశం మాత్రం లేదని తెలుగు సినీ దిగ్గజ హీరోలు చెప్పకనే చెప్తున్నారు. ‘అఖండ’తో మొదలుపెడితే దాదాపుగా టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలన్నీ ఒక దాని తర్వాత మరొకటి విడుదలకు ‘క్యూ’లో ఉన్నాయి. కానీ ఏ ఒక్కరు కూడా తమ ఇండస్ట్రీకి కావాల్సిన అంశాల గురించి ప్రస్తావించడం లేదు.

జగన్ సర్కార్ ను ప్రసన్నం చేసుకునేందుకు మరో మార్గాన్ని తెలుగు సినీ హీరోలు ఎంచుకున్నారా? అన్న ప్రశ్న ఉత్పన్నం అయ్యేలా తాజా పరిణామాలు కనపడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, మహేష్ బాబులు తలా 25 లక్షల రూపాయలను వరద బాధితులను ఆదుకునే నిమిత్తం ముఖ్యమంత్రి విపత్తు నిధికి విరాళాలు ప్రకటించారు. ఈ జాబితాలో మరికొంత మంది హీరోలు వారి వారి చదివింపులను ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

హీరోలంతా తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటించడం మంచి పరిణామమే… సాయం చేయగలిగే స్థాయి ఉన్న హీరోలు నిజంగా చేయాలి కూడా..! దీనిపై విమర్శలు చేయడం తగదు. కానీ విరాళాల ప్రకటన చేసే సమయమే పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. వరదల ప్రభావంతో కుదేలై దాదాపుగా వారం గడిచింది. తీవ్రత ఎక్కువగా ఉన్నపుడే ఈ విరాళాల ప్రకటనలు వచ్చి ఉంటే ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పోయేది.

కానీ సినీ ఇండస్ట్రీకి ప్రతికూలంగా టికెట్ ధరల ప్రకటన తర్వాత ఈ “చదివింపుల పర్వం” అనేది కేవలం సీఎంను ప్రసన్నం చేసుకోవడానికేనా? విరాళాలు ప్రకటించిన హీరోల సినిమాలకు ఏపీలో ఏదైనా “స్పెషల్ బెనిఫిట్స్” ఉంటాయా? మరో గమనించదగ్గ అంశం ఏమిటంటే… ఇప్పటివరకు తెలిపిన ముగ్గురు టాప్ హీరోలు కూడా, ముందే అనుకున్నట్లుగా ఒకే ‘ఫిగర్’ను ప్రకటించడం! జగన్ పుణ్యమా అంటూ మంచి పని కూడా రాజకీయంగా మారిపోయింది.