Tollywood hero On Special Statusఏపీకి ప్రత్యేక హోదా సాధన నిమిత్తం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ‘మౌన నిరసన’కు దిగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నటులు తమ మద్దతు తెలిపారు. మద్దతు తెలిపిన వారిలో ‘మెగా’ కుటుంబానికి చెందిన యువ హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ తో పాటు యువ కథానాయకులు సందీప్ కిషన్, తనీష్, నిఖిల్, శివ బాలాజీ కూడా ఉన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పవన్ ‘మౌన నిరసన’కు వారు తమ మద్దతు తెలిపారు.

‘ప్రజలకు మంచి చేసే ఏ పనికైనా నా మద్దతు ఉంటుంది’ అని వరుణ్ తేజ్, ‘ఇచ్చిన మాట కోసం పోరాడాల్సిన సమయం’ అని సాయిధరమ్ తేజ్, ‘వైజాగ్ లో 26న జరిగే ‘మౌన నిరసన’లో బాధ్యత గల పౌరుడిగా పాల్గొంటున్నా’ అని సందీప్ కిషన్, ‘మనం ఐక్యంగా ఉండాల్సిన సమయం’ అని తనీష్, ‘అందరికీ ఒకటే విఙ్ఞప్తి, మనస్ఫూర్తిగా మధ్యలో తొణుకు బెణుకులు లేకుండా, వెనకడుగు వేయకుండా, మనకు వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాడుదాం…’ అని నటుడు శివబాలాజీ పేర్కొన్నారు. కాగా, గోపీచంద్, రఘు కుంచె కూడా తమ మద్దతు తెలిపారు.

అలాగే ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయమై ఒక తెలుగు వాడిగా తన మద్దతు ఉంటుందని ప్రముఖ నటుడు సంపూర్ణేష్ బాబు అన్నారు. ఒక మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ… ‘జల్లికట్టు’పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం ఎత్తి వేయాలని తమిళ ప్రజలు చేసిన పోరాటం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తితో త్వరలో నిర్వహించే మౌన నిరసన కార్యక్రమంలో తాను పాల్గొంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తనకు ఎటువంటి ఆహ్వానం లేదని, స్వచ్ఛందంగానే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నానని చెప్పారు. ఈ ‘మౌన నిరసన’ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతున్నారనే విషయం తనకు తెలియదని సంపూ చెప్పారు.